మానకొండూర్, ఆగస్టు 30 : కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతుల సాగునీటి కష్టాలు తీరిస్తే.. ఆయనపై కోపంతో రేవంత్ సర్కారు రైతుల నోట్లో మట్టికొడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంతానికి పోయి రైతులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. నీళ్లు ఎత్తిపోయడం లేదని, ఎల్లంపల్లి ద్వారా నీళ్లు ఎత్తిపోసి వెంటనే మిడ్‌మానేరు, ఎల్ఎండీ జలాశయాలను నింపాలని సూచించారు.
శుక్రవారం మానకొండూర్ మండలకేంద్రంలోని గడిమహల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం మోటర్లను ఆన్‌చేసి ఎత్తిపోతలు ప్రారంభిస్తే రైతులు కేసీఅర్‌ను గుర్తుచేసుకుంటారనే అక్కసుతోనే కాంగ్రెస్ సర్కారు కాళేశ్వరం నీటిని సముద్రంపాలు చేస్తున్నారని మండిపడ్డారు. జూలై, ఆగస్టు నెలల్లో రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ప్రస్థుతం మేడిగడ్డ వద్ద లక్ష 75 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నదని, అయినా సర్కారుకు సోయిలేదన్నారు. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయకున్నా కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీళ్లు ఎత్తిపోయవచ్చని నీటిపారుదలశాఖ అధికారులే చెబుతున్నారని వెల్లడించారు. వర్షాలు లేక పోవడంతో ఎల్ఎండీ రిజర్వాయర్ ఇప్పటికీ నిండలేదని, ఎల్లంపల్లి ద్వారా నీటిని ఎత్తిపోసి మిడ్‌మానేరు, ఎల్ఎండీ జలశాయాలను నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎల్ఎండీ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
కాకతీయ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తే కుంటలు, చెరువులు నిండి భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెడితేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ డిజైన్ చేసి మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద నిత్యం నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టే ఇంజినీరింగ్ అధికారుల సూచనల మేరకే అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం రీ డిజైన్‌పై రాద్దాంతం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ మంత్రులు, ఎంపీలు నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. నవంబర్ నెలలో పంటలకు నీళ్లు ఎక్కువగా అవసరం ఉంటాయని, వెంటనే ఎత్తిపోతలు ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఅర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బీఅర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, దేవ సతీశ్‌రెడ్డి, రామంచ గోపాల్‌రెడ్డి, జక్కుల నాగరాజు, అశోక్‌రెడ్డి, వెంకటస్వామి, పిండి సందీప్, ఇస్కుల్ల ఆంజనేయులు పాల్గొన్నారు.