అక్షరాలా 3,24,234 కోట్లతో కాంగ్రెస్ సర్కారు శుక్రవారం శాననసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పూర్తిగా బడాయిల బడ్జెట్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు నాడు అడ్డగోలు హామీలు ఇచ్చినా.. నేడు అమలుకు కేటాయింపులు లేకపోవడం అన్ని వర్గాలనూ నిరాశ పరిచింది. ప్రధానంగా ఉద్యోగాల భర్తీ విషయంలోనే కాదు, యువతకు అన్ని రకాలుగా సర్కారు రిక్తహస్తం చూపింది. యువ వికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ముచ్చటే లేదు. 4వేల నిరుద్యోగ భృతి అంశాన్ని మచ్చుకైనా చెప్పలేదు. కొత్త ఉద్యోగాల భర్తీ అంశంపై స్పష్టత ఇవ్వకుండా దాటవేసింది. మేనిఫెస్టోలో చెప్పిన ‘రైతు భరోసా’కు రాం.. రాం పలికినట్టు స్పష్టమవుతున్నది. ఎకరాకు 15వేల ముచ్చట మాట మాత్రమైనా చెప్పని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ఇప్పటికే బకాయిపడిన రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వలేదు. చేయూత పథకానికి చేయి ఇచ్చి, పింఛన్‌దారుల ఆశలపై నీళ్లు చల్లారు. కోటి మంది మహిళలకు కోటి చీరెల పథకానికి అరకొరగా నిధులు ప్రతిపాదించి, చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. రిటైర్ట్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపు అంశాన్నే ప్రస్తావించలేదు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బసంత్‌నగర్ విమానాశ్రయం ముచ్చటే లేదు. ఇలా ఒకటి రెండు కాదు, దాదాపు ప్రతి వర్గాన్నీ బడ్జెట్ నిరాశ పరిచింది.
– కరీంనగర్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం కింద ఎకరాకు రెండు పంటలకు కలిపి ఏడాదికి 15వేలు, వ్యవసాయ కూలీలకు 12వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన విషయం తెలిసిందే. తాజా బడ్జెట్లో ఈ ముచ్చటే చెప్పలేదు. గత బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన మాదిరిగానే ఎకరాకు 6వేల చొప్పున రెండు పంటలకు 12వేలు ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. ఇదిలా ఉంటే.. రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పాత బకాయిల ముచ్చటపై స్పష్టత ఇవ్వకుండానే ముగించారు. రెండు లక్షల వరకు రుణమాఫీ కాని రైతులు లక్షల్లో ఉన్నారు. వారి గురించి ఊసే ఎత్తలేదు. ఉమ్మడి జిల్లాలో దాదాపు ఏడు లక్షల మంది ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.
తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో అయినా జ్యాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుందని నిరుద్యోగ యువత ఆశ పడింది. కానీ, దాని గురించి చెప్పకుండా.. కొత్త ఉద్యోగాలు, నోటిఫికేషన్ల గురించి ఊసెత్తకుండా.. కేవలం ఇప్పటివరకు 67,763 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పి, ఆర్థిక మంత్రి ప్రసంగం ముగించడంపై విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్లోనే ఒక క్లారిటీ లేకపోతే.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ సర్కారు చేయూత పథకానికి చేయిచ్చింది. తాము అధికారంలోకి వస్తే రూ.4వేలకు పింఛన్లు పెంచుతామని చెప్పినా.. ఈ సారి కూడా రిక్తహస్తమే చూపింది. ఫలితంగా పింఛన్ పెరుగుతుందని ఉమ్మడిజిల్లాలో ఆశలు పెట్టుకున్న 3.25 లక్షల మందికి నిరాశే మిగిలింది. అదనంగా మరో రెండు లక్షల పింఛన్లు ఇస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెంచుతారా.. లేదా? అన్న విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువ డిక్లరేషన్ పేరిట ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్.. మూడో బడ్జెట్లోనూ యువతీ యువకులకు రిక్తహస్తమే చూపింది. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినా.. ప్రస్తుతం ఆ ముచ్చటే ఎత్తలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెలా 4వేల నిరుద్యోగభృతి చెల్లిస్తామని చెప్పినా.. నిరుద్యోగ భృతి కోసం ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్నా.. కనీసం పరిగణలోకి తీసుకోలేదు. యువ మహిళా సాధికారత కింద 18 ఏళ్ల వయసు పైబడి చదువుకునే ప్రతి యువతికీ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని గతంలో హామీ ఇచ్చినా స్పష్టత లేదు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 18వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు నిరాశే మిగిలింది.
రాజీవ్‌గాంధీ ఆశయాలకు కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తున్నట్టు కనిపిస్తున్నది. పలు రాజ్యాంగ సవరణాల ద్వారా కేంద్రం నుంచి నిధులు నేరుగా పంచాయతీలకు వచ్చే విధంగా రాజీవ్‌గాంధీ చర్యలు తీసుకుంటే.. రాష్ట్రం ప్రభుత్వం మాత్రం పంచాయతీలకు ఎటువంటి నిధులు కేటాయించకుండా వివక్ష చూపిందన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి రెండు బడ్జెట్ల సమయంలో పంచాయతీల పాలవర్గాలు లేవు. ఇటీవలే కొత్తగా ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గాలు వచ్చిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తారని ఆశించాయి. కానీ, రాష్ట్రంలోని 12,702 గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం భారత ప్రభుత్వం 1,597 కోట్లు కేటాయించినట్టు చెప్పిన భట్టి విక్రమార్క, రాష్ట్రం నుంచి ఏమిస్తారో చెప్పకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కోటి మంది మహిళలకు కోటి చీరెల కార్యక్రమం కింద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నట్టు బడ్జెట్లో చెప్పిన సర్కారు, ఇప్పటివరకు 70 లక్షల మందికి ఇచ్చామని, మిగిలిన చీరెలను త్వరలోనే అందిస్తామని చెప్పింది. అందుకోసం బడ్జెట్లో రూ.258 కోట్లు కేటాయింపులను ప్రతిపాదించింది. నిజానికి ఇప్పటికే ఇచ్చిన చీరలకు సంబంధించి నేతన్నలకు డబ్బులు రావాల్సి ఉన్నది. అలాగే గత దసరాకు సంబంధించి ఇంకా 30 లక్షల చీరలు పంపిణీ చేయాల్సి ఉన్నది. వచ్చే దసరాకు మరో కోటి చీరలు అందించాల్సి ఉంది. కేటాయింపులు చూస్తే నామమాత్రంగా ఉన్నాయని, ఇవి ఏమూలకు సరిపోవన్న అభిప్రాయాలు వ్యక్తమయవుతున్నాయి.
కల్యాణలక్ష్మి కింద ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి రూ.లక్ష ఆర్థిక సహాయంతోపాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ, ఈ బడ్జెట్లో తులం బంగారం గురించి ప్రస్తావించ లేదు. నిధులు కేటాయింపులు లేవు. అంటే తులం బంగారం కాగితాలకే పరిమితమైనట్టు స్పష్టమవుతున్నది.
ఉద్యోగ విమరమణ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు రెండేళ్లుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బెనిఫిట్స్ రాక ఆందోళనతో ఎంతో మంది చనిపోవడం కూడా కలకలం రేపుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తారని వారంతా ఆశించారు. కానీ, ఈ బడ్జెట్లో ప్రస్తావించకుండా వారి ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందని విమర్శిస్తున్నారు.
ప్రతి పన్నెండేళ్లకోసారి జరిగే గోదావరి పుష్కరాలపై సర్కారు శీతకన్ను పెట్టినట్టు తెలుస్తున్నది. తాజా బడ్జెట్లో 500 కోట్లను మాత్రమే ప్రతిపాదించింది. కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని గొప్పలు చెప్పినా.. కేటాయింపులు చేసిన తీరు మాత్రం విమర్శలకు తావిస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలన్న డిమాండ్ వస్తున్నది.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటికి 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేసినట్టు వెల్లడించింది. అందుకోసం 7,430 కోట్ల కేటాయింపులను ప్రతిపాదించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఇండ్లు మంజూరు చేస్తారా.. లేదా..? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో కొత్తగా ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకున్న లక్షా ఇరవై వేల మంది ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
బీసీలపై కాంగ్రెస్ సర్కారు వగల ప్రేమ చూపుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో సుమారు 56 శాతం వెనుకబడిన తరగతుల వారు ఉన్నారని, బీసీ సంక్షేమం కోసం ఏడాదికి 20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల కేటాయింపులు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పింది. కానీ, బడ్జెట్లో మాత్రం సంక్షేమానికి 12,511 కోట్లు కేటాయించింది. దీనిపై బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇది కాంగ్రెస్ బీసీలపై చూపుతున్న పక్షపాతానికి నిదర్శమని మండిపడుతున్నాయి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న బసంత్‌నగర్ విమానాశ్రయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. ఈ బడ్జెట్లో వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల గురించి ప్రస్తావించినా.. బసంత్‌నగర్ గురించి ఊసే ఎత్తలేదు. దీంతో ఈ విమానాశ్రయం ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకోగా.. ఇక్కడి ప్రజలకు మళ్లీ ఎదురుచూపే మిగిలింది.
రాష్ట్రంలో రిటైర్డ్ అవుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనరీ బెనిఫిట్స్ ఇప్పటికే 12 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 5 వేల కోట్లు పెరిగే అవకాశం ఉన్నది. అయినా చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం శోచనీయం. దశలవారీగా బకాయిల చెల్లింపునకు సమ్మతించినా.. ఆ దిశగా బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా ఈ రెండున్నరేళ్లలో నెరవేర్చలేదు. తమ సర్వీస్ కాలంలో దాచుకున్న ఇన్సూరెన్స్ ఫండ్ సొమ్మును కూడా రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులు తిరిగి పొందడానికి ఏళ్ల తరబడి వేచి చూడడం అత్యంత దారుణం. వైద్య ఖర్చులు భరించలేక రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది వారి ఆస్తులను అమ్ముకుంటున్నారు. అందులో చాలామంది చనిపోతున్నా ప్రభుత్వం ఎటువంటి కనికరం చూపకపోవడం విషాదకరం. దీనిపై రిటైర్డ్ ఉద్యోగులుగా తీవ్ర నిరసన తెలుపుతున్నాం.
– సుంకిశాల ప్రభాకర్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, ప్రధానకార్యదర్శి
తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సరైన బడ్జెట్ కేటాయించ లేదు. ఏటా 20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఆరంభం నుంచి నేటి వరకు మోసం చేస్తూనే ఉన్నది. నిరుద్యోగులకు సంబంధించి ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. నిరుద్యోగ భృతికి ఎగనామం పెట్టినట్టు కనిపిస్తున్నది. అలాగే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ, బడ్జెట్లో మాట కూడా మాట్లాడలేదు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు.. ప్రస్తుతం జరుగుతున్న కేటాయింపులను విద్యావంతులు మేధావులు యువతీ యువకులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
– ప్రసన్న హరికృష్ణ, విద్యావేత్త
ఎన్నికల ముందు కాంగ్రెస్ బీసీలకు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పింది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నది. కానీ, బడ్జెట్ కేటాయింపులో మాత్రం బీసీలకు మొండి చేయి చూపుతున్నది. ఈ బడ్జెట్లో కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఉన్న ప్రేమకు నిదర్శనం ఇది. బీసీ సంక్షేమ శాఖలో లోటు బడ్జెట్ కారణంగా గత పదమూడేళ్లుగా కార్పొరేషన్‌కు రుణాలు మంజూరు కాలేదు. ఇప్పటి వరకు 7,600 కోట్లు విద్యార్థుల ఫీజులు, బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. బీసీ వసతి గృహాలకు సరకుల సరఫరా సరిగ్గా లేదు. అందులో పని చేస్తున్న కార్మికుల వేతనాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. జనాభాలో 50 శాతానికి మించి ఉన్న బీసీలకు అదే స్థాయిలో బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే తీరని ద్రోహం చేసింది. బీసీలకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించక తప్పదు.
– జక్కని సంజయ్ కుమార్, బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు
బడ్జెట్ బీసీలు, ముఖ్యంగా చేతి వృత్తులపై ఆధారపడిన వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే రజక వృత్తికి తీరని ద్రోహం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకునే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కనిపించడం లేదు. బీసీలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని, కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. తీరా బీసీలు, చేతి వృత్తులకు తీరని అన్యాయం చేసింది. కార్పొరేషన్ల ద్వారా రుణాలు వస్తాయని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ఆయా కులాలు, చేతి వృత్తుల వారికు నిరాశే ఎదురైంది. ఇప్పటికైనా రజక కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా 5 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలి. వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న రజకులను ఆదుకోవాలి.
– పూసాల సంపత్ కుమార్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
రేవంత్‌రెడ్డి సర్కారు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తున్నది. అన్ని వర్గాలకూ వ్యతిరేకంగా ఉంది. ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడం లేదు. అంబేద్కర్ అభయహస్తం, మహిళలకు రూ.2,500 పెన్షన్ అడ్రస్ లేదు. రూ.మూడున్నర లక్షల కోట్లు అప్పు చేశామని చెబుతున్న ప్రభుత్వం.. ఏ పథకానికి, ఏ ప్రాజెక్టుకు ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేయాలి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే
సర్కారు పూర్తిగా సంక్షేమ పథకాలను విస్మరించింది. ఆరు గ్యారంటీల అమలుపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. మహిళలకు హామీ ఇచ్చిన తులం బంగారం, సూటీ పథకాలకు నిధుల కేటాయింపు లేవు. ఉద్యోగాల క్యాలెండర్‌పై ఒక మాట చెప్పలేదు. రైతుల సంక్షేమానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. యువతకు కొత్త ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. అలాంటి కేటాయింపులు చేయలేదు. విద్యా వ్యవస్థ బలోపేతంపైనా స్పష్టమైన ప్రణాళిక కనిపించలేదు. ఇది కేవలం కాగితాల మీద ఉన్న బడ్జెట్ మాత్రమే.. ప్రాక్టికల్‌గా ప్రజలకు ఉపయోగ పడేది కాదు. తెలంగాణ ప్రజల కోసం కాకుండా, ఢిల్లీకి పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న బడ్జెట్‌లా ఉంది.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వం ఈ బడ్జెట్లో అన్ని వర్గాలకు మొండి చేయి చూపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు కేటాయిస్తరని ప్రజలంతా ఎదురు చూశారు. కానీ, రేవంత్ ప్రభుత్వం మరోసారి అందరినీ మోసం చేసింది. వృద్ధులు, దివ్యాంగుల పింఛన్ పెంపు హామీలను పూర్తిగా విస్మరించింది. నేతన్నల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. మొత్తంగా ఇది ఒక ఫాల్స్, ఫెయిల్, చీటింగ్ బడ్జెట్ అని ప్రజలు భావిస్తున్నారు.
– తోట ఆగయ్య, రాజన్న సిరిసిల్ల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రజలను ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలపై వివక్ష చూపెట్టారు. ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీల ఊసే లేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో కాంగ్రెస్ జాతీయ నాయకులు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో బీసీల సంక్షేమానికి ప్రతి సంవత్సరం 20వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 12 వేల కోట్లే బడ్జెట్లో పెట్టారు. ఇది బీసీలను నయవంచన చేయడమే. వృద్ధులకు పెన్షన్ 4 వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి ఆ మాట తప్పారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమానికి నిధులు మంజూరులోనూ వివక్ష చూపారు. మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వకుండా రిక్తహస్తం చూపారు. రాజీవ్ యువ వికసం పేరుతో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగుల గొంతు కోశారు. తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే బడ్జెట్ ఇది. పూర్తిగా అంకెల గారడీ మాత్రమే.
– చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షుడు
రాష్ట్రంలో 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తుండడం బాధాకరం. ప్రభుత్వం నిధుల కొరత ఉందన్న కారణంతో గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జీపీఎఫ్ వంటి కీలక ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకుండా పెండింగులో పెట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. దశాబ్దాలపాటు సర్వీస్ చేసిన ఉద్యోగులను రిటైర్మెంట్ అనంతరం ఇలా నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు న్యాయం? ఉద్యోగ జీవితమంతా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైరైన తర్వాత ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. కానీ, ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నది. చేతిలో డబ్బులు లేక, అత్యవసర వైద్యం చేయించుకోలేక, గుండెపోటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఇప్పటికే రాష్ట్రంలో 70 మందికి పైగా మరణించారు. ఈ మరణాలు కేవలం గణాంకాలు కాదు, పరిపాలనా లోపాల తీవ్రతను ప్రతిబింబిస్తున్న విషాద ఘటనలు. అధికారంలో ఉన్న ప్రభుత్వం నిధుల కొరత పేరిట బాధ్యత నుంచి తప్పించుకోవడం భావ్యం కాదు. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం అన్యాయం. నెలకు రూ.1500 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్ ప్రతిపాదనలకు సవరణలు చేసి రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.
– మానేటి ప్రతాపరెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, టీఆర్టీఎఫ్