అభివృద్ధిలోనే కాదు, సంక్షేమంలోనూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు రాష్ట్ర సర్కారు మొండిచేయి చూపింది. గురువారం రాష్ట ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగింది. రుణమాఫీపై గొప్పలు చెప్పిన కాంగ్రెస్, ఒకే దఫా 2లక్షలు చేస్తామన్న హామీని విస్మరించి, తొలుత లక్ష వరకు చేసే ప్రయత్నం చేసింది. అయితే ప్రయోజనం దక్కని రైతులు వేలాది మంది ఉండగా, వారికి మళ్లీ చేస్తారా..? లేదా..? అన్నదానిపై స్పష్టత ఇవ్వడం మరిచింది. ఇక అణగారిన వర్గాల్లో వెలుగులు నింపే దళిత బంధును పూర్తిగా విస్మరించింది. పథకంపై మచ్చుకైనా ప్రస్తావనలేకపోవడంతో లబ్ధిదారులకు నిరాశేమిగిలింది. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఇన్నాళ్లూ గోబెల్ ప్రచారం చేసి, ఇప్పుడు మాత్రం మాటమార్చి వేల కోట్ల ప్రజాధనం కాపాడేందుకు నేషనల్ డ్యాం సెప్టీ అథారిటీకి ప్రాజెక్టులు అప్పగించామని పేర్కొనడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి అద్దం పడుతున్నది. నేతన్నలు ఉపాధి లేక ఆగమైపోతున్నా, డిమాండ్ల సాధనకు సమరం చేస్తున్నా పట్టనట్టు వ్యవహరించింది. ఇక కొత్తగా మరో డీఎస్సీ వేస్తామని నిన్నామొన్నటిదాకా బీరాలు పలికి, ఇప్పడు ఆ ప్రస్తావనే లేకపోవడం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఫీజు రీయింబర్స్మెంట్ ముచ్చటనూ మరిచింది. మొత్తంగా ఒకటి రెండు అంశాలు తప్ప ఏ విషయంలోనూ స్పష్టత, భరోసా ఆశాజనంగా లేకపోవడంతో కొత్త సర్కారు విమర్శల పాలవుతున్నది.
కరీంనగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో 2024-2025 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్ల లెక్కచెప్పారు. అయితే ఈ బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మొండిచేయి చూపడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఎంతో ఆశగా ఎదురుచూసినా ఎందులోనూ స్పష్టత ఇవ్వకపోవడంపై పెదవి విరుస్తున్నారు. మానేరు రివర్‌ఫ్రంట్, ఆరు గ్యారెంటీల్లోని యువ వికాసం, రైతుభరోసా, చేయూత పింఛన్లు, మహిళలకు 2500 ఇలా ఎన్నో అంశాల గురించి బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు, గొల్ల కుర్మలు, బీసీలు, దళితులను పూర్తిగా విస్మరించారని మండిపడుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులకు భరోసా ఇవ్వడాన్ని మరిచినట్టు కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 2లక్షల రుణమాఫీ చేసేందుకు 31వేల కోట్లను సమీకరించుకుంటామని చెప్పిన మంత్రి, మొదట లక్షలోపు రుణాలను జూలై 18న రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. కానీ, లక్షలోపు మాఫీ జరగని వారికి తిరిగి ఇస్తామని ఎక్కడా ప్రకటించలేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా దాదాపు లక్ష మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగాల్సి ఉంది. దానిపై ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అలాగే కౌలు రైతుల అంశం ఊసే లేదు. క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పారే తప్ప, ఎప్పటి నుంచి ఇస్తారో..? స్పష్టత ఇవ్వలేదు. ధరణి దరఖాస్తులను ఎప్పటివరకు పరిష్కరిస్తుంది? దానికి డెడ్‌లైన్ ఏంటి? అన్నదాని గురించి వివరించలేదు.
స్కూల్ యూనిఫాం కుట్టే పనిని స్వయం సహాయక బృందాల మహిళలకు అప్పగించామని, కుట్టు చార్జీలను జతకు 75కు పెంచుదామని, దీని ద్వారా 29,680 సంఘాల మహిళా సభ్యులకు సుమారు 50 కోట్ల లబ్ధి జరుగుతుందని పేర్కొన్న మంత్రి ఎప్పటిలోగా సంఘాలకు అప్పగిస్తారో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. నిజానికి కుట్టుకూలీ కింద ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన 50 ఇచ్చారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న 25 మాత్రం ఇవ్వడం లేదు.
దళితబంధు పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నా బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశంపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ఆ వర్గంపై కాంగ్రెస్‌కు ఉన్న నిర్లక్ష్యాన్ని తెలుపుతున్నది. నిజానికి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్‌లో మొత్తం 18,021 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 9.90 లక్షల చొప్పున కేసీఆర్ ప్రభుత్వం జమచేసింది. అందులో 8,148 మంది లబ్ధిదారులకు రెండో విడుత కింద డబ్బులు రావాల్సి ఉంది. వీటి కోసం లబ్ధిదారులు అధికారులకు గతంలోనే కొటేషన్లు సమర్పించారు. వాటిని క్లస్టర్ అధికారులు పరిశీలించి ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి సమర్పించారు. ఆ మేరకు నిధులు లబ్ధిదారులకు విడుదల చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం పూనుకున్న సమయంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న నేపథ్యంలో చాలా మంది లబ్ధిదారులు ఇప్పటికే హైదరాబాద్ వెళ్లి ప్రజాభవన్‌లో రెండో విడుత నిధులకోసం దరఖాస్తు సమర్పించారు.
పరిష్కారం కాకపోవడంతో కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజావాణికి తరలివచ్చి ఆందోళన చేయడంతోపాటు వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టును కలుపుకొని మొత్తం 38,232 మంది లబ్ధిదారులను కేసీఆర్ ప్రభుత్వం ఎంపిక చేసి నిబంధలన ప్రకారం వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని సదరు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసింది. ఆ లెక్కన రెండో విడుత కింద ఇంకా 11,108 మందికి నిధులు ఇవ్వాల్సి ఉంది. నిబంధనల ప్రకారం చూసినా సదరు లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. దళిత బంధు పథకాన్ని నిలిపేస్తారా..? లేక కొనసాగిస్తారా..? అన్న సందేహం కూడా ఉంది.

ప్రభుత్వం బడ్జెట్లో పాత పాటే వినిపించింది. అయితే ఇక్కడో ఓ మాట మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అక్రమాలు జరిగాయంటూ గోబెల్ ప్రచారం చేసిన కాంగ్రెస్, బడ్జెట్లో మాత్రం వేల కోట్ల ప్రజాధనం వృథాకాకుండా ఉండేందుకు నేషనల్ డ్యాం సెప్టీ అథారిటీకి ప్రాజెక్టును అప్పగించామని చెప్పుకున్నది. అయితే నిన్నా మొన్నటి వరకు రూ.లక్ష కోట్ల దుర్వినియోగం జరిగినట్లుగా విమర్శలు గుప్పించి, ఇప్పుడు మాట మార్చడం వారి అసత్య ప్రచారానికి అద్దం పడుతున్నది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పటి నుంచి సాగుకు నీరు ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం ఆయకట్టు రైతులపై చూపుతున్న కక్షకు నిదర్శనంగా చెప్పవచ్చు.
25వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ పెడుతామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్, ఈ బడ్జెట్లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. 11,062 పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ జారీచేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం, మరో డీఎస్సీ వేస్తుందా..? లేదా..? అన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో పాటుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందా..? లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణకు 2024లో ఒక కమిటీని నియమించామని, త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని మంత్రి చెప్పడం శుభపరిణామమే. అయితే ఇక్కడి రైతులకు ఇంకా దాదాపు 112కోట్ల బకాయిలు రావాల్సి ఉండగా, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తున్నట్టు చెప్పినా.. అయితే పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పలేదు.

ఓ వైపు పనిలేక నేతన్నలు ఆత్మహత్యలు, ఆకలిచావులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేతన్నలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరు బాట పట్టారు. గురువారం సిరిసిల్ల బంద్ విజయవంతంగా కాగా, రేపు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం బడ్జెట్లో ఏమైనా హామీ వస్తుందోనని ఎదురుచూశారు. కానీ మళ్లీ పాత ముచ్చటే చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. చేనేత రంగ పునర్జీవం కోసం చర్యలు చేపట్టామని, ప్రభుత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే వస్ర్తాలతో పాటు స్కూల్ యూనిఫాంలు, దవాఖానల్లో ఉపయోగించే బెడ్షీట్లు వంటివి చేనేత సహకార సంస్థ ద్వారా సేకరించాలని, స్థానిక నేతన్నలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంతే తప్ప అందుకు సంబంధించిన ఆర్డర్లు ఎప్పుడిస్తారో మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పాలకులు ఇదే ముచ్చట చెప్పారు. కానీ, నేటి బడ్జెట్లో ఏ మాత్రం స్పష్టత ఇవ్వకపోవడంతో నేతన్నలు ఆగ్రహిస్తున్నారు. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు కేంద్రం ద్వారా సాధించామని చెప్పిన మంత్రి, దాని ద్వారా నేతన్నలకు ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో మాత్రం వివరించలేకపోయారు.
యువ వికాసం కింద ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామని, విద్యార్థులకు ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తామని, దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఒక నాణ్యమైన ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చుతామని, గతంలో కాంగ్రెస్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల బాలబాలికలకు స్కాలర్షిప్ పెంచి ఇస్తామంటూ ఎన్నో హామీలను ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. కానీ, బడ్జెట్లో ఏ ఒక్కదాని గురించి స్పష్టత ఇవ్వలేకపోయింది. ప్రధానంగా విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ప్రతి విద్యార్థికీ విద్యాభరోసా కార్డు ఇస్తారా..? ఇవ్వరా..? ఒకవేళ ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు? దీని విధి విధానాలు ఏమిటీ? అన్నదానిపై మాట్లాడకపోవడంతో విద్యార్థిలోకం ఆందోళన చెందుతున్నది.
రాష్ట్ర బడ్జెట్ రాబడి, ఖర్చుల లెకపత్రం లాగ ఉన్నది. కేటాయింపులు చెప్పడం మినహా లక్ష్యం లేని బడ్జెట్ ఇది. భవిష్యత్తులో ఏం అభివృద్ధి చేయబోతున్నారనే దానిపై విజన్ లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి విజన్ లేని ప్రగతి నిరోధక పద్దు.
– సుగుణాకర్‌రావు, బీజేపీ సీనియర్ నాయకుడు (కరీంనగర్ విద్యానగర్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉంది. ఇందులో కులవృత్తులు, నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఒక విజన్ లేకుండా పోయింది. చేనేత, ఐటీ, పారిశ్రామిక రంగాలతోపాటు దేవాలయాల అభివృద్ధికి సరైన ప్రాధాన్యత ఇవ్వపోవడం ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనం.
– అల్లాడి రమేశ్, సెస్ మాజీ చైర్మన్ (చందుర్తి)
అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బడ్జెట్లో ప్రజలకు అన్యాయం చేసింది. ఏ ఒక్క పథకానికి, హామీకి నిధులు కేటాయించలేదు. ఏదో చేస్తుందని అనుకుంటే పూర్తిగా ప్రజలను నిరాశపరిచింది. ఇది ప్రజా ప్రయోజనం లేని పద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సబ్బండవర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేటాయింపులు చేసింది. కానీ, కాంగ్రెస్ సర్కారు నాటి పథకాలకు రూపు లేకుండా చేసింది. చేతివృత్తుల రంగాన్ని పూర్తిగా విస్మరించింది. చేనేత, గీత, ముదిరాజ్ కులస్తులకు మేలు చేసేలా బడ్జెట్ రూపకల్పన జరుగలేదు.
– వొడితల సతీశ్ కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే (చిగురుమామిడి)
రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార ప్రవేశపెట్టిన బడ్జెట్ దళిత, గిరిజన వ్యతిరేకంగా ఉన్నది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గత సర్కారు తెచ్చిన దళిత బంధు ఊసే లేదు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ఎకడా కేటాయింపులు లేవు. విద్యావ్యవస్థ, యువత, మహిళ అభివృద్ధికి సంబంధించినవి లేకపోవడం బాధాకరం. అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో ప్రజలకు అన్యాయం చేసింది. ఏ ఒక్క పథకానికి, హామీకి నిధులు కేటాయించలేదు. బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని అనుకుంటే, పూర్తిగా నిరాశే ఎదురైంది.
– సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే (చొప్పదండి)
ఈ బడ్జెట్‌తో ప్రభుత్వ పాలన విధానం, వైఖరి స్పష్టమైంది. ప్రజా సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను పక్కన పెట్టింది. దళిత బంధు ఎత్తేసినట్టుగా కనిపిస్తున్నది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రైతులపై కక్షపూరితంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు అనిపిస్తున్నది. రైతు భరోసాపై స్పష్టత లేదు.
– దావ వసంత, జడ్పీ మాజీ చైర్సన్ (జగిత్యాల)
కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను మోసం చేసింది. రాష్ట్ర బడ్జెట్లో గల్ఫ్ సంక్షేమానికి మొండిచేయి చూపింది. ఎన్నికల ముందు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నిధులు, ప్రత్యేక ప్యాకేజీని అందిస్తామని చెప్పి బడ్జెట్లో సున్నా నిధులు కేటాయించింది. కాంగ్రెస్‌కు గల్ఫ్ కార్మిక కుటుంబాలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. ప్రపంచంలో ఎకడ ఉన్నా తెలంగాణ బిడ్డలను, గల్ఫ్ కార్మికులను అక్కున చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీయే.
– రాధారపు సతీశ్ కుమార్, బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు (కోరుట్ల)
రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యతా రంగాలకు అన్యాయం జరిగింది. విద్య, వైద్యం, ఉత్పాదక రంగాలకు అరకొర నిధులు కేటాయించింది. జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించలేదు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రస్తావనే లేదు. ప్రతి మహిళకు 2500 ఇస్తామని చేసిన ఎన్నికల హామీకి సరిపడా నిధుల కేటాయింపు లేదు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లలో స్పష్టత కరువైంది. నిరుద్యోగ భృతిని విస్మరించింది. కేవలం సన్నరకం ధాన్యానికి 500 బోనస్ వచ్చే సంవత్సరం ఇస్తామనడం సిగ్గుచేటు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ 7 వేల కోట్ల నిధులను కేటాయించకపోవడం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే. వెంటనే బడ్జెట్‌ను సవరించాలి.
– మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి (కరీంనగర్ తెలంగాణచౌక్)
రాష్ట్రంలో చేనేత, పవర్‌లూం పరిశ్రమలు తీవ్ర సంక్షోభంతో మూతపడ్డయి. నేతన్నలు రోడ్డు పడ్డరు. ఇప్పటి వరకు 14మంది నేతన్న ఆత్మహత్యలు చేసుకున్నరు. గత బీఆర్ఎస్ సర్కారు బడ్జెట్లో 1283కోట్లు కేటాయించింది. బతుకమ్మ చీరెలు, నేతన్న బీమా, యార్న్ సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్ పథకాలను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథాకాలన్నింటిని నిలిపేసి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం బడ్జెట్లో కేవల 355 కోట్లు రూపాయలను మాత్రమే కేటాయించి నేతన్నలను మోసం చేసింది. సమస్యల పరిష్కారం కోసం నేతన్నలు ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేస్తున్నరు.
– కూరపాటి రమేశ్, తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి