అద్భుతంగా వెంకన్న గుడి
టీటీడీ సహకారంతో కరీంనగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తామని, దీని వల్ల నగరానికి ఆధ్యాత్మిక శోభ వస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
- నగరంలో 20 కోట్లతో 10 ఎకరాల్లో నిర్మాణం
- 18 నెలల్లో పూర్తి చేస్తాం
- మినీ తిరుమలగా కరీంనగర్
- టీటీడీ చరిత్రలోనే మొదటిసారి ఒకే రాష్ట్రంలో రెండో ఆలయం
- 31న నిర్మాణానికి భూమిపూజ
- మంత్రి గంగుల కమలాకర్
- విజయవంతం చేయాలని పిలుపు
కార్పొరేషన్, మే 20 : టీటీడీ సహకారంతో కరీంనగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తామని, దీని వల్ల నగరానికి ఆధ్యాత్మిక శోభ వస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పద్మనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించే స్థలాన్ని, భూమిపూజ పనులను టీటీడీ అధికారులు, స్థపతులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అన్ని కులాలు, అన్ని మతాల వారు సమానంగా గౌరవింపబడుతున్నారని తెలిపారు.
కరీంనగర్లో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. టీటీడీ ఏ రాష్ట్రంలోనైనా అక్కడి రాజధానిలో ఒక ఆలయాన్ని మాత్ర మే నిర్మిస్తుందని, కానీ, తెలంగాణలో మాత్రం ఇప్పటికే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నిర్మించిందని, ఇప్పుడు కరీంనగర్లోనూ నిర్మించబోతున్నదన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు, కావేరి భాసరరావుతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించామని, సీఎం ప్రత్యేక చొరవ తీసుకొని టీటీడీకి లేఖ రాయడంతోపాటు పద్మనగర్‌లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు కూడా ఆమోదం తెలిపి 20 కోట్ల మంజూరు చేసిందన్నారు. నిర్మాణ పనుల కోసం ఇటీవలే తిరుమల తిరుపతిని సందర్శించి టీటీడీ బోర్డు మీటింగులో ఆలయ నిర్మాణ పత్రాలు, పను ల టెండర్ల ప్రక్రియ గురించి కూలంకషంగా చర్చించామన్నారు.
ఈ నెల 31న ఉదయం 7.20 గంటలకు టీటీడీ వెంకన్న ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్నామని, దీనికి టీటీడీ చైర్మన్ వైవీ సు బ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు, వేద పండితులు హాజరవుతారని వెల్లడించారు. ఈ ఆలయాన్ని 18 నెలల్లోనే పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. తిరుమల తిరుపతిలోలాగానే వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని, స్వామివారి కైంకర్యాలు సైతం అలాగే నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 22న తిరుమల దేవస్థాన ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి దీక్షితులు సమక్షంలో గర్భాలయం నిర్మించే స్థలంలో భూకర్షణం నిర్వహిస్తామన్నారు. దీనికి ముందుగా గర్భాలయం నిర్మించే భూమిని శుద్ధిచేసి భూమిలో నవధాన్యాలు నాటి అవి మొలకెత్తిన తర్వాత ఆ గడ్డిని గోవులకు ఆహారంగా వేస్తారని పేర్కొన్నారు.
31న జరిగే భూమిపూజకు నగర ప్రజలంతా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదే రోజు సాయంత్రం శ్రీనివాస కల్యాణం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భూమిపూజ రోజు మూడు ఏనుగులను తీసుకువస్తున్నామని తెలిపారు. తూర్పులో ఒక అద్భుతమైన బావి ఉంటుందని, ఎడమ వైపు కోనేరు, మండపాలు, ఆలయ సిబ్బంది గదులు ఉంటాయన్నారు. ఇప్పటికే డిజైన్లు, ప్లాన్లు సిద్ధమైనట్లు వివరించారు. ఆలయ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ మినీ తిరుమలగా వెలుగొందనుందన్నారు.
ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు టీటీడీ అధికారులతోపాటు ఒక నోడల్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉంటారన్నారు. టీటీడీ ఈఈ నర్సింహమూర్తి మాట్లాడుతూ, ఈ ఆలయ నిర్మాణానికి టీటీడీ 20 కోట్లు మంజూరు చేసిందని, మరో 30 కోట్లు ఇతర విరాళాలతో నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఆలయ నిర్మాణం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు కేటాయించిందన్నారు. తొలిసారిగా టీటీడీ చరిత్రలో ఒకే రాష్ట్రంలో రెండో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఈ నాగరాజు, ఏఈ చల్మానాయక్, అసిస్టెంట్ స్థపతి రవికాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు పిల్లి మహేశ్, సుమన్‌రావు, కర్ర సూర్యశేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- .
- beauty
- bring
- constructed
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

