మారుమూల పల్లెలో పుట్టి దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న వొడితల రాజేశ్వర్‌రావుకు తెలంగాణలో సమున్నత గౌరవం లభిస్తున్నది. చదువుల వెలుగులు పంచిన విద్యాప్రేమికుడు, మలిదశ ప్రత్యేక పోరులో ఉద్యమనేత కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. తుది శ్వాస వరకు ప్రజాసేవలో తరించిన ఆయన 2011 జూలై 24న కన్నుమూశారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయన స్మారకార్థం రాజేశ్వర్‌రావు నిలువెత్తు విగ్రహాన్ని సొంతూరైన సింగాపురంలో ఏర్పాటు చేశారు. నేడు మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆయన జీవితవిశేషాలపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
-హుజూరాబాద్ రూరల్, జూలై 23
వొడితల రాజేశ్వర్‌రావు హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో 1931 సెప్టెంబర్ 16న వొడితల కమల-శ్రీనివాస్‌రావుకు దంపతులకు జన్మించారు. హుజూరాబాద్‌లో ప్రాథమిక విద్య, వరంగల్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. సతీమణి శారద 20 ఏళ్ల క్రితం మృతిచెందారు. సోదరులు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు (మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు), డాక్టర్ విశ్వనాథరావు, కుమారులు వొడితల కిషన్‌రావు, శ్రీనివాసరావు, కూతురు జ్యోతి, మనుమళ్లు కౌశిక్, వశిష్ట, ప్రణవ్ ఉన్నారు. రాజేశ్వర్‌రావు 2011 జూలై 24న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన స్మారకార్థం కుటుంబసభ్యులు రాజేశ్వర్‌రావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
సింగాపురం కేంద్రంగా మొదలైన వొడితల రాజేశ్వర్‌రావు రాజకీయ ప్రస్థానం ఢిల్లీ దాకా సాగింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు అంతరంగిక సలహాదారుడిగా కొనసాగారు. పీవీ ఐదేళ్లు ప్రధానిగా కొనసాగడంలో రాజేశ్వర్‌రావు కీలకపాత్ర పోషించారు. సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ, ఆజాద్, ఏకే ఆంటోనీతో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి.
రాజేశ్వర్‌రావు 1954-56 వరకు జిల్లా ప్లానింగ్ కమిషన్ మెంబర్‌గా పనిచేశారు. 1956-59 వరకు నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ భీమదేవరపల్లి బ్లాక్ కో ఆప్షన్ మెంబర్, 1959-1970 వరకు సర్పంచ్‌గా, 1970-72 వరకు భీమదేవరపల్లి సమితి ప్రెసిడెంట్‌గా, 1972-78 వరకు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా, 1975-77 వరకు వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశారు. 1980-85 వరకు ఎమ్మెల్సీగా, 1992-98 వరకు రాజ్యసభ సభ్యుడిగా, 1994లో ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగారు. 1993-98లో జాతీయ పట్టణ, గ్రామీణాభివృద్ధి, జాతీయ పర్యాటక అభివృద్ధి, జాతీయ రవాణ మంత్రిత్వ శాఖ కన్సల్టెటీవ్ కమిటీ సభ్యుడిగా, జాతీయ ఇండస్ట్రీ హౌసింగ్ కమిటీ మెంబర్‌గా పని చేశారు. 2004 నుంచి మరణించే వరకు వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ చైర్మన్‌గా కొనసాగారు.
రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన వొడితల రాజేశ్వర్ రావు దేశంలో ప్రముఖ విద్యా సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరించారు. తెలంగాణలో తొలి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ 1980లో ఆయనే స్థాపించారు. 1985లో మహారాష్ట్రలోని రాంటెక్‌లో కవి కుల గురు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ను ఏర్పాటు చేశారు. 1997లో సొంత ఊరు సింగాపురంలో తన తల్లి పేరిట కమల ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని నిర్మించారు. వరంగల్, హైదరాబాద్‌లో విద్యాసంస్థలు స్థాపించి చైర్మన్‌గా వ్యవహరించారు.
2001లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. తన సోదరుడు వొడితల లక్ష్మీకాంతారావును టీఆర్ఎస్లోకి పంపించి కేసీఆర్‌కు అండదండగా ఉండాలని సూచించారు. పలుమార్లు రాష్ట్ర ఆవశ్యకతను కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.
పేదలకు సాయం చేయడంలో రాజేశ్వర్‌రావు ముందుండే వారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య, పదో తరగతి విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇచ్చారు. ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు.