కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 17: శ్రీవారి కల్యాణానికి వేళయింది. కరీంనగర్ మారెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి సప్తమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవీ భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
కాగా, శ్రీ పద్మావతీ అమ్మవారికి పుట్టింటి వారైనా పద్మశాలీలు శనివారం శోభాయాత్రగా వచ్చి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, పుస్తె, మట్టెలు, సారె సమర్పించారు. రాత్రి నిర్వహించిన ఎదుర్కోళ్ల ఉత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.