కలెక్టరేట్, ఫిబ్రవరి 8: పార్లమెంట్ ఎన్నికల కోసం రూపొందిస్తున్న ఓటరు తుది జాబితాలో తప్పులు లేకుండా చూడాలని అధికారులను ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీదేవసేన ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ 2024పై ఉమ్మడి జిల్లాలోని ఈఆర్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గురువారం కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకు పనులు చేపట్టాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో బీఎల్వోల పనితీరును పరిశీలించాలని, ఒకే ఇంటి నంబరు పరిధిలో ఉండే ఓటర్లంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒకేచోట ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్నైట్లెతే, వాటికి ఎంట్రీ, ఎగ్జిట్లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. పార్టీల ప్రతినిధులతో సమావేశమై జాబితాలో తొలగించిన వివరాలను అందించాలన్నారు. ఓటు నమోదు, మార్పు చేర్పులకు అవకాశమున్నదన్నారు.
కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, చనిపోయిన ఓటర్ల వివరాలు మున్సిపల్, పంచాయతీ రికార్డుల ఆధారంగా జిల్లావ్యాప్తంగా తొలగిస్తామని ఫారమ్ 7 ద్వారా ఎవరైనా బదిలీ అయినా, చనిపోయిన ఓటర్ల వివరాలు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. రెండుచోట్ల నమోదైన వారి వివరాలు పరిశీలించి, తొలగిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, అరుణశ్రీ, డీఆర్వో పవన్‌కుమార్, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు.
ఒక కుటుంబంలోని ఓట్లు ఒకే పోలింగ్ బూత్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ, ఎలక్ట్రోరల్ రోల్ అబ్వర్వర్ శ్రీదేవసేనకు బీఆర్ఎస్ నాయకుడు సత్తినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యల్లో భాగంగా నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్పెషల్ సమ్మరి రివిజన్ 2024 సమీక్ష సమావేశంలో పాల్గొనగా, జిల్లాలో గత శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆమెకు లిఖితపూర్వకంగా విన్నవించారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని పరిశీలించిన ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ మాట్లాడుతూ, గత సమస్యలు పునరావృతం కాకుండానే ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.