సమాజహితం కోసం పాటుపడ్డ గొప్ప మేధావి శ్రీభాష్యం విజయసారథి. ఆయన మృతి తీరని లోటు. సమాజహితం కోసం పాటుబడిన గొప్ప మేధావి. ఆయన గౌరవానికి వన్నె తెచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉన్నది. కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల ప్రాంగణంలో రూ.15 కోట్లతో నిర్మిస్తున్న కళావేదికకు అమృతవర్షిణి పేరు ప్రతిపాదనలో ఉంది. అయితే, ఆ స్థానంలో పద్మశ్రీ శ్రీ భాష్యం పేరు పెడతాం. అదే ఆవరణలో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేక ర్యాక్ ఏర్పాటు చేసి జిల్లా వాసులకు ఆయన పుస్తకాలను అందుబాటులో ఉంచుతాం.
– శ్రీభాష్యం సంస్మరణ సభలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కమాన్‌చౌరస్తా, జనవరి 22 : జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాల ప్రాంగణంలో కరీంనగర్ కార్పొరేషన్ నిధులు రూ. 15 కోట్లతో నిర్మిస్తున్న కళావేదికకు అమృతవర్షిణి పేరు ప్రతిపాదనలో ఉండగా, దానికి బదులు పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి పేరును పెడుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అదే ఆవరణలో ఆయన కాంస్య విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
సర్వవైదిక సంస్థానంట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ పట్టణంలో బొమ్మకల్ రోడ్డులోని యజ్ఞవరాహక్షేత్రంలో నిర్వహించిన శ్రీభాష్యం విజయసారథి సంస్మరణ సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గురువులాంటి శ్రీభాష్యం విజయసారథి మృతి తనకు తీరని లోటని, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేపోతున్నామన్నారు. ఆయన సమాజహితం కోసం పాటుబడిన మేధావి అని కొనియాడారు. ఆయన గౌరవానికి వన్నె తేవాల్సిన బాధ్యత తనపై ఉన్నదన్నారు. ఈ క్రమంలోనే జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేక ర్యాక్ ఏర్పాటు చేసి శ్రీభాష్యం పుస్తకాలను జిల్లా వాసులకు అందుబాటులో ఉంచుతామన్నారు.
దేశం గర్వించదగ్గ పండితుడు : వినోద్‌కుమార్
దేశం గర్వించదగ్గ పండితుడు, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీభాష్యం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కొనియాడారు. కరీంనగర్లో పుట్టి జాతీయ కీర్తి పొందిన ఆయన సంస్కృత భాషా పరిరక్షణకు ఎనలేని కృషి చేశారన్నారు. శ్రీభాష్యం విజయసారథికి పద్మశ్రీ పురస్కారం రావడం జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. ఈ తరానికి సంస్కృత భాష అంటే శ్లోకాలు వినడమే తప్ప వచ్చే పరిస్థితి లేదని, అది చాలా బాధాకరమన్నారు.
సంస్కృతం వాడుక భాషలో లేదని, కేవలం రేడియోలో వినడం మాత్రమేనని, మన లాంటి సామాన్యులు నేర్చుకోలేకపోయామని చెప్పారు. సంస్కృతంపై అవగాహన ఉంటే, అందులోని అర్థాన్ని, భాషను ఆస్వాదించేవాళ్లమని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణకు సంస్కృత యూనివర్సిటీ కావాలని పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించానని గుర్తు చేశారు. శ్రీభాష్యం విజయసారథి ఆలోచనలు, సందేశం పట్ల తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తామన్నారు.
విజయసారథి ఆశయాలు, స్ఫూర్తిని కొనసాగిస్తామని, ట్రస్టు తీర్మానించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా ఆయన పేరు చిరస్థాయిగా గుర్తిండిపోయేలా కృషి చేస్తామని మేయర్ సునీల్ రావు హామీ ఇచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు శ్రీభాష్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. అంతకుముందు ట్రస్టు తరఫున తీర్మానించిన అంశాల పత్రాన్ని మంత్రి గంగుల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు మేజేజింగ్ ట్రస్టీ శ్రీభాష్యం వరప్రసాద్ అందజేశారు. అంతకు ముందు శ్రీభాష్యం చిత్రపటం వద్ద అందరూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా శ్రీభాష్యం వరప్రసాద్, సభ్యులుగా కొదుమగళ్ల సుగుణాకరాచార్య, ఎస్బీ కల్యాణి, డీవీ శేషాచార్య, మాదాడి కృష్ణారెడ్డి, వుచ్చిడి మోహన్ రెడ్డి, సాయినేని నరేందర్, వాల రవీందర్ రావు, కసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, తొడుపునూరి సతీశ్, నరెడ్ల బాబయ్య ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, రాష్ట్ర ట్రెజరీ విభాగాధిపతి, సంగీత నాటక అకాడమీ మాజీ కార్యదర్శి వసుంధర, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు కోల మాలతి, తోట రాములు పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి ఉమ్మడి జిల్లాకు చెందిన కవులు, రచయితలు శ్రీభాష్యంపై రాసిన కవిత్వాన్ని వినిపించి పత్ర సమర్పణ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, కేఎస్ అనంతాచార్య, శేషాచార్య, గాజుల రవీందర్, ముదుగంటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.