వేములవాడ టౌన్, జూన్ 9 : ఓవైపు వేసవి సెలవులు ముగుస్తుండడం, మరోవైపు రాజన్న ఆలయాన్ని త్వరలో మూసివేస్తారని ప్రచారం సాగుతుండడంతో భక్తుల సంఖ్య రెట్టింపైంది. సాధారణ రోజుల్లో 25 వేల నుంచి 30వేల మంది వస్తుండగా, ప్రస్తుతం 40వేల నుంచి 50వేల వరకు రావడం కనిపిస్తున్నది. ఆది, సోమ, శుక్రవారాల్లో 50వేల నుంచి 60వేల మంది భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సైతం 60వేల మందికిపైగా రాగా, అందుకు తగిన ఏర్పాట్లు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్లకు సంబంధించి సూచిక బోర్డులు, మార్కింగ్ లేక ఎటు వెళ్లాలో తెలియక అవస్థలు పడ్డారు.
దర్శనానికి ఆరు గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చిందని వాపోయారు. క్యూలైన్లో కనీసం మంచినీటి సదుపాయం కూడా లేదని ఆవేదన చెందారు. కోడె మొక్కు టికెట్ కోసం పార్కింగ్ స్థలం వద్ద క్యూలైన్లో దాదాపు 4 గంటల సమయం పట్టిందని తెలిపారు. ఆలయం తూర్పు భాగంలో నుంచి 100 టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్తే ఆలయ పరిసరాలు దుర్గంధభరితమైన వాసనతో ఉన్నాయని కొందరు భక్తులు ఆగ్రహించారు. గతంలో వేములవాడకు వచ్చిన ప్రతీసారి దర్శనం చాలా సవ్యంగా జరిగేదని, ఈసారి మాత్రం చేదు అనుభవం మిగిలిందని చెప్పారు.