రామడుగు, జూలై27 : కేటీఆర్ సవాల్‌కు ప్రభుత్వం దిగొచ్చి పంపులు ఆన్ చేసిందని, ఇది పూర్తిగా బీఆర్ఎస్, రైతుల విజయంగా భావిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ చెప్పారు. అబద్ధపు మాటలతో ప్రజల్ని మోసం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికైనా నిజాలను చెప్పాలని డిమాండ్ చేశారు.
శనివారం ఆయన రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్ వద్ద విడుదలైన కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గోదావరి నిండుగా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద ఉన్న కక్షతో ఎత్తిపోతలు ప్రారంభించడం లేదని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులకు నీళ్లివ్వకుండా ఆగం చేస్తున్నదని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి నీళ్ల విషయంలో మేడిగడ్డ కూలిపోతుందని, గోదావరిలో కొట్టుకపోతుందని ఆనాడు చెప్పిన మాటలను, ఈ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేయడం దురదృష్టకరం అని అన్నారు. లక్షల క్యూసెకుల ఇన్ ఫ్లోను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ నిలబడ్డా వారికి కనిపించడం లేదన్నారు. జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కారుకు నీళ్లివ్వాలనే సోయి లేదని విమర్శించారు.