కమాన్‌చౌరస్తా, అక్టోబరు 20: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లో, మండపాల్లో కుంకుమ పూజలు, అలంకారాలు, అన్నదానాలు చేశారు. విద్యార్థులతో పూజలు, పల్లకీ సేవలు నిర్వహించారు. చైతన్యపురి మహాశక్తి ఆలయం, యజ్ఞవరాహస్వామి క్షేత్రం, గాయత్రీనగర్ గణేశ శారదాశంకరాలయాల్లో భక్తులు మొకులు చెల్లించుకున్నారు. మండపాల్లో అర్చనలు, అభిషేకాలతో పాటు హవనాలు, పూజలు నిర్వహించారు.
చైతన్యపురి మహాశక్తి ఆలయంలో అమ్మవారు కాత్యాయినీ రూపంలో భక్తులకు దర్శనమివ్వగా, అమ్మవారికి పసుపుకొమ్ములతో విశేషాలంకారం చేశారు. సాయంత్రం సరస్వతీ పూజ, పల్లకీసేవ నేత్రపర్వంగా నిర్వహించారు. గాయత్రీనగర్‌లోని గణేశ శారదాశంకరాలయంలో పంచామృతాభిషేకాలు, అర్చనలు, సరస్వతీ పూజలు జరిగాయి. పాతబజార్ గౌరీశంకర, వావిలాలపల్లి శ్రీహనుమత్ సహిత కనకదుర్గ, కమాన్ రోడ్డు రామేశ్వరాలయం, బొమ్మకల్ రోడ్డులోని అంబాభవానీ ఆలయాల్లో పూజలు జరిగాయి. అలాగే, పలు మండపాల వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్ మర్రి భావన-సతీశ్, జీకే యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగుల ప్రదీప్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సంతోష్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ముకరంపుర, అక్టోబర్ 20: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సరిల్ కార్యాలయంలో ఎస్ఈ వీ గంగాధర్ ఆధ్వర్యంలో నవచండీ యాగం వైభవంగా నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. విద్యుత్ సంస్థ, ఉద్యోగులు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండి అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే యాగం నిర్వహించినట్లు ఎస్ఈ పేరొన్నారు. పూజల్లో డీఈలు జే రాజం, విజయేందర్ రెడ్డి, తిరుపతి, చంద్రమౌళి, కాళిదాసు, లక్ష్మీరెడ్డి, రాజేశం, రాజేంద్రప్రసాద్, నరేందర్, అంజయ్య ,కిరణ్, కే రాజు, స్వప్న, లావణ్య, అరవింద్, చంద్రయ్య, రఘుపతి, శ్రీనివాసు, సంపత్ కుమార్, వెంకటేశ్, వెంకట్ నారాయణ, శ్రీమతి, శ్వేత, ఏఈలు, లైన్ మెన్లు, ఉద్యోగులు, యూనియన్లు, అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు.
గంగాధర, అక్టోబర్ 20: మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ర్యాలపల్లిలో దుర్గామాత మండపంలో ఎమ్మెల్యే కూతురు జాహ్నవి పూజలు చేశారు. అలాగే, మధురానగర్‌లోని దుర్గామాత మండపంలో ఎమ్మెల్యే రవిశంకర్ భారీ మెజార్టీతో గెలవాలని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు ఎండీ అబ్బాస్ పూజలు చేశారు. ఆచంపల్లి దుర్గామాత మండపం వద్ద మహిళలు కుంకుమ పూజలు చేశారు. పూజల్లో సర్పంచ్ పానుగంటి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, కోలపురం లక్ష్మణ్, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
చొప్పదండి, అక్టోబర్ 20: మండల కేంద్రంలోని భక్తమార్కండేయ ఆలయంలో, వైశ్యాభవన్‌లో ఆర్యవైశ్య సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గాదేవీ మండపాల వద్ద మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీ దేవీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి మహిళలు కుంకుమార్చన పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భక్తమార్కండేయ ఆలయ కమిటీ సభ్యులు, యువజన సంఘం సభ్యులు, ఆర్యవైశ్య సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 20: కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని దుర్గాభవానీ ఆలయంలో అమ్మవారు సరస్వతీ దేవీ అలంకరణలో హంస వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయధర్మాధికారి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు పవనకృష్ణశర్మ అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చి పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్. అక్టోబర్ 20: మండలంలోని చెర్లభూత్కూర్ చెన్నకేశవాలయం వద్ద ప్రతిష్ఠించిన దుర్గామాత సన్నిధిలో నవకన్య పూజలు చేశారు. దుర్గామాతను సరస్వతీదేవీగా అలంకరించగా, అర్చకుడు సుధాకరాచార్యులు ఫల పంచామృతాలతో అభిషేకం చేశారు. తొమ్మిదేళ్లలోపు బాలికలతో నవకన్య పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజల్లో ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే, వేణుగోపాలస్వామి ఆలయంలో గీతాభక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవీ సన్నిధిలో అర్చకులు శ్రీనివాసాచార్యులు, సుధాకరాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. దుర్శేడ్‌లోని వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించిన అమ్మవారి సన్నిధిలో ఎంపీటీసీ గోలి రాజ్యలక్ష్మి-సంతోష్ కుటుంబసభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. వేడుకల్లో మాజీ ఉపసర్పంచ్ కోరుకంటి వేణుమాధవరావు, దుర్గాభవానీ దీక్షా కమిటీ సభ్యులు గాజుల హరికృష్ణ, వేముల రాంచంద్రం, రాజ్‌కమల్, సంపత్, శ్రీనివాస్, రవీందర్, అరుణ్‌రావు, బుర్ర రమేశ్ గౌడ్, శివ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, అక్టోబర్ 20: వన్నారం, గోపాల్రావుపేటలో దుర్గామాతకు భక్తులు బోనాలు చేశారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.