Infectious diseases | కోల్ సిటీ, జూలై 8: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగర పాలక సంస్థలో నూతనంగా విలీనమైన గ్రామాలలో ఆయన మంగళవారం పర్యటించారు. ఇంటింటికి స్టిక్కర్లు అంటించారు.
దోమల నివారణకు నగర పాలక సంస్థ చేస్తున్న స్ప్రే, ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయడం తదితర పనులను పర్యవేక్షించారు. ప్రజలు కూడా దోమ తెరలు వాడటం, కిటికీలకు జాలీలు అమర్చుకోవడం చేయాలన్నారు. అనంతరం గోదావరిఖని శివాజీనగర్ కూరగాయల మార్కెట్ లోని మరుగుదొడ్డి నిర్వహణను పరిశీలించారు. గాంధీ చౌరస్తా నుంచి రామాలయం రోడ్డులో వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సుపై అవగాహన కల్పించారు. రీగల్ షూమార్ట్ రోడ్డులో వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం ప్రయోజనాలను వివరించారు.
గంగానగర్ లోని రంగానథ స్వామి ఆలయ ఆవరణలో జరుగుతున్న గోడ సందేశాత్మక చిత్రాలను పరిశీలించారు. పీకే రామయ్య కాలనీలో నిర్వహించిన వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, కుమారస్వామి, హెల్త్ అసిస్టెంట్ సంపత్, వార్డు అధికారులు సాయి, గంగయ్య, శ్రీనివాస్, సీఓలు శ్వేత, శమంత, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.