Peddapally | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 24 : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం పారిశుధ్యంపై సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. పెద్దపల్లి మండలంలోని కనగర్తి గ్రామాన్ని అకస్మికంగా సందర్శించి గ్రామపంచాయతీ కార్యాలయ రికార్డులను పరిశీలించి, గ్రామ పరిసరాలు, నర్సరీని సందర్శించారు.
ఈ సందర్భంగా డీపీవో వీరబుచ్చయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న పన్ను బకాయిల వసూళ్లతో పంచాయతీల ఆదాయం పెంచాలన్నారు. నర్సరీల్లో ప్రజలకు ఉపయోగపడే మొక్కల పెంపకం ఉండేలా చూసుకోవాలన్నారు. కొత్తగా గెలిచి బాధ్యతలు చేపట్టిన సర్పంచులు, పాలకవర్గ సభ్యులతో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజారోగ్యంపై బాధ్యత ప్రభుత్వ అధికారులపైననే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకుని పనులు చేయాలన్నారు.
పంచాయతీ కార్యదర్శులంతా సమయపాలన పాటించాలని పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంత సమస్యలపై అధికారులు, సిబ్బంది ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేసుకోవాలని అధికారులుగా అత్యుత్సాహానికి పోకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిర్లక్ష్యం వహించే పంచాయతీ కార్య దర్శులు సిబ్బందిపై శాఖపరమైన చర్యలుంటాయని జాగ్రత్తగా పనులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యేడెల్లి శ్రీదేవి శంకరయ్య, మండల పంచాయతీ అధికారి జనగామ శరత్ బాబు, పంచాయతీ కార్యదర్శి చల్ల సంధ్య , పలువురు సిబ్బంది పాల్గొన్నారు.