తెలంగాణ చౌక్/ రుద్రంగి /ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్, ఫిబ్రవరి 2: ప్రతి వాహనదారుడు, ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద 35వ రోడ్డు భద్రతా మాసోత్సావాల్లో భాగంగా విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వాహనదారులకు ట్రైయినీ ఎస్పీ రాహుల్‌రెడ్డితో కలిసి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రాణం ఎంతో విలువైందన్నారు. మన మీద కుటుంబం ఆధారపడి ఉంటుందని దృష్టిలో ఉంచుకొని హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా, మద్యం సేవించి, నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదని పేర్కొన్నారు. బాధ్యతా రాహిత్యంతో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదుకు తెచ్చుకోవద్దని సూచించారు.
ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లు డ్రైవింగ్ చేయడం నేరమన్నారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు, జిల్లాలోని ప్రతి పాఠశాలలో రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ రాజు విద్యార్థులు, వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇక్కడ అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, సీఐ రఘుపతి, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, సిబ్బంది ఉన్నారు. కాగా రుద్రంగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెడ్ కానిస్టేబుల్ బాపురెడ్డి, బొప్పాపూర్‌లోని జ్ఞానదీప్ పాఠశాలలో మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్, వీర్నపల్లిలోని మోడల్ స్కూల్లో ఎస్ఐ రమేశ్‌కుమార్, ముస్తాబాద్ జూనియర్ కళాశాలలో ఎస్ఐ శేఖర్‌రెడ్డి విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.