గంభీరావుపేట, ఆగస్టు 28: నర్మాల ఎగువమానేరు సమీపంలో పశువులకు మేత వేసేందుకు వెళ్లిన ఆరుగురు రైతుల్లో ఒకరు గల్లంతుకాగా, మిగిలిన ఐదుగురు గురువారం క్షేమంగా బయటపడ్డారు. ఎగువన కామారెడ్డి, మెదక్ జిల్లాలో కూడవెల్లి, పాల్వంచ వాగుల ప్రవాహంతో నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు బుధవారం భారీ వరద వచ్చి చేరింది. నర్మాలకు చెందిన ఆరుగురు రైతులు పంపుకాడి నాగయ్య, ద్యానబోయిన స్వామి, పిట్ల నర్సింహులు, పిట్ల మహేశ్, జంగం స్వామి, పిట్ల స్వామి ఉదయం 9 గంటలకు ప్రాజెక్టు సమీపంలో పొలం వద్ద పశువులకు మేత వేయడానికి వెళ్లారు.
తిరిగొచ్చే క్రమంలో ముందు వెళ్తున్న నాగయ్య మానేరు లోలెవల్ వంతెన రోడ్డు ప్రవాహంలో గల్లంతయ్యాడు. గమనించిన తోటి రైతులు అక్కడే వాగు ఒడ్డున ఉండిపోయారు. విషయం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. చిక్కుకున్న రైతులకు ఆహారంతో పాటు తాగు నీటిని డ్రోన్ ద్వారా అందించారు. దాదాపు 26 గంటల తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో మూడు నేవీ హెలీకాప్టర్లు రాగా, రైతులు సురక్షితంగా బయటపడ్డారు. కాగా, నాగయ్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతామని కలెక్టర్ తెలిపారు. కాగా, బాధిత రైతులు, గల్లంతైన నాగయ్య కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పరామర్శించారు.
లింగన్నపేటకు చెందిన తాళ్ల ప్రవీణ్ పశువులకు మేత వేయడానికి వెళ్లి బుధవారం మానేరువాగులో చిక్కుకుని చెట్టుపై తలదాచుకున్నాడు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంద సహాయక చర్యలు ప్రారంభించి అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రవీణ్‌ను సురక్షితంగా బోటులో గడ్డకు తీసుకువచ్చారు. అలాగే ప్రాజెక్టు సమీపంలో ఇటుక బట్టీలో పని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన కూలీలు ముగ్గురిని సైతం ముందస్తుగా హెలీకాప్టర్ ద్వారా కోళ్లమద్దికి తరలించారు.