కరీంనగర్ స్వచ్ఛత కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న వాహనాలు పారిశుధ్య విభాగంలోని కొందరు అధికారుల తీరుతో నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. నెలల తరబడిగా షోకేస్‌లో బొమ్మల్లా మారుతున్నాయి. స్వచ్ఛ ఆటోల కేటాయింపుల్లో వివక్ష చూపిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపణలు గుప్పిస్తుండగా, నెలల తరబడిగా ఎందుకు పక్కకు పెట్టారన్న విషయం చర్చకు దారి తీసింది. ముడుపులు అందకపోవడం వల్లే వాటిని వినియోగంలోకి తీసుకురావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 27 : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం అధికారులు సుమారు రూ.90 లక్షలు వెచ్చించి 10 స్వచ్ఛ ఆటోలను మున్సిపల్ ఎన్నికలకు ముందుగానే కొనుగోలు చేశారు. వీటితో పాటు కొనుగోలు చేసిన పారిశుధ్య ట్రాక్టర్లను వినియోగంలోకి తీసుకువచ్చిన అధికారులు, ఆటోలకు మాత్రం కేటాయింపులు చేయడం లేదు. గతంలోనే రూ.50 వేల డిపాజిట్‌తో ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేసే వారికి అప్పగించేందుకు నిర్ణయించి చర్యలు చేపట్టారు.
అయితే, ముడుపులు ఇస్తేనే పారిశుధ్య విభాగంలోని కీలకాధికారులు ఆటోలను అప్పగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. వీటికి సంబంధించి ఆయా చెత్త సేకరణ వ్యక్తులతో ఒప్పందాలు చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన ఉన్నతాధికారులు స్వచ్ఛ ఆటోల కేటాయింపులు పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి ఇవి కోర్టు రిజర్వాయర్ వద్ద ఉంటున్నాయి. పారిశుధ్య అధికారులు అనుకున్నట్లు కాకపోవడం వల్లే నెలలు గడిచిపోతున్నా ఆటోలను వినియోగంలోకి తీసుకరావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దందా కొనసాగితే ఇప్పటికే ఆటోలు రోడ్డు మీదికి వచ్చేవని తెలుస్తోంది.
ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించే యత్నాలు
కాగా, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న విషయంలో ఇప్పటికే ఆరోపణలు రావడంతో ఈ ఆటోలను ప్రైవేటుకు చెందిన ఏజెన్సీలకు అప్పగించేందుకు సమాలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ కోసం ఓనర్ కమ్ డ్రైవర్ పథకం కింద డిపాజిట్లు స్వీకరించి ప్రైవేటు వ్యక్తులకు స్వచ్ఛ ఆటోలను అప్పగించారు. దీంతో అన్ని డివిజన్లలో ఇంటింటి నుంచి చెత్త సేకరణకు యూజర్ చార్జీలు వసూలు చేసుకుంటూ పనులు చేపడుతున్నారు. కాగా, ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసిన ఆటోలను ఏజెన్సీకి అప్పగించడం ఏంటన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఇప్పటికే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరో 18 ఆటోలు నడుస్తున్నాయి. వీటిలో 9 ఆటోలను ఇటీవల రూ.50 వేల డిపాజిట్‌తో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఏజెన్సీకి అప్పగించాలన్న ఆలోచన ఉంటే బల్దియా ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఆటోలను ఏజెన్సీకే ఇవ్వకుండా కొన్నింటిని ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారన్న విమర్శలు వస్తున్నాయి. మరో 9 ఆటోలను ఇప్పటికీ నగరపాలక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీటిని బల్దియా నిర్వహిస్తున్నప్పుడు కొత్త ఆటోలను ఏజెన్సీలకు అప్పగించాలన్న ఆలోచన ఎందుకు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.