రాయికల్, మే 29: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం తీసుకొచ్చిన పథకాల అమలుకు అనేక కొర్రీలు పెట్టడం సరికాదని, షరతుల్లేకుండా వర్తింపజేయాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే అనేక నిబంధనలు తెస్తున్నదని మండిపడ్డారు. గురువారం రాయికల్ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో బీఆర్ఎస్ పట్టణ, మండల నాయకులతో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు.
ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు కేవలం ప్రజలను మభ్య పెట్టేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ స్థలం కేవలం అరగుంటకే పరిమితం చేయడం, ఒక్క అడుగు విస్తీర్ణం పెరిగినా బిల్లులు ఇవ్వబోమని చెప్పడం దురదృష్ట కరమన్నారు. అరగుంటలో ఇల్లుకడితే బంధువులు వచ్చిన సందర్భాల్లో మెదిలే స్థలం ఉండదని, నిర్మాణం స్థలం పెంచి తదనుగుణంగా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు మూడు రంగులు వేసి కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించిందన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇత్తేసీ పొత్తు కూడిన చందంగా కాంగ్రెస్ పాలన ఉందని విమర్శించారు. నిరుద్యోగ యువత కోసం తెచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులోనూ క్లారిటీ లేదని, ఓ వైపు సిబిల్ సోర్కు సంబంధం లేదంటూనే మరో వైపు అంతర్గతంగా చెక్ చేస్తూ రిజెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
ఇంటర్వ్యూల పేరుతో కాలయాపన చేస్తూ యువతని ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. పథకం అమలు దశల వారీగా ఉంటుందని చెబుతున్న సర్కారు, స్పష్టమైన విధి విధానాలు ప్రకటించాలని, అర్హులందరికీ సబ్సిడీ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అనిల్, మండల అధ్యక్షులు బరం మల్లేష్, కో ఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి, మాజీ మారెట్ కమిటీ చైర్మన్లు రాణి సాయి కుమార్, ఉదయ శ్రీ, మైనార్టీ మండల అధ్యక్షులు చాంద్ పాషా, మాజీ ఎంపీటీసీలు నాగరాజు, రాజేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీరాముల సత్య నారాయణ, మహేందర్, నాయకులు గంగారం, ప్రశాంత్ రావు, సోహెల్, శ్రీను, గంగాధర్, రామచంద్రం పాల్గొన్నారు.