నిమ్మపల్లి మోగా కంపెనీ ప్లాంట్ నుంచి గుట్టుగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జగిత్యాలకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్ అధికారుల కళ్లుగప్పి ఈ అక్రమ వ్యవహారానికి తెరలేపాడు. ఏకంగా నకిలీ వే బిల్లులు, అనుమతి పత్రాలు సృష్టించి లారీలు, టిప్పర్లలో సిద్దిపేటకు తీసుకెళ్తూ అందినకాడికి దండుకుంటున్నాడు. పోలీసుల తనిఖీలు చేసి అనుమతుల్లేని ఇసుక వాహనాలను ఠాణాకు తరలించడంతో ఈ గుట్టు రట్టయింది.
– కోనరావుపేట, ఆగస్టు 11
బీఆర్ఎస్ సర్కారు మెట్ట రైతులకు నీరందించాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్యాకేజీ-9లో భాగంగా మల్కపేట రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా లిఫ్ట్‌ల ద్వారా మండలానికి ప్రధాన జలవనరు అయిన నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టును నింపేందుకు రూ.166 కోట్లు మంజూరు చేసింది. మెగా కంపెనీ పనులు దక్కించుకొని ప్రారంభించింది.
పనుల నిర్వహణకు నిమ్మపల్లి శివారులో కంపెనీ బాధ్యులు ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పైపులు, ఇతర సామగ్రిని ఇందులో నిల్వ ఉంచారు. అప్పటి ప్రభుత్వం ఉచిత ఇసుక రవాణాకు ఉత్తర్వులు ఇవ్వడంతో లిప్ట్ పనులకు అవసరమైన ఇసుకను ఇక్కడే నిల్వ చేశారు. కొంతమేర పనులు కూడా పూర్తి చేశారు. అయితే ప్రభుత్వం మారడం..నిధులు రాకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
నకిలీ పత్రాలతో సిద్దిపేటకు..
పనులు నిలిచిపోవడంతో ఇదే అదనుగా భావించిన కాంట్రాక్టర్ ఇసుక అక్రమ వ్యవహారానికి తెరలేపాడు. డంప్‌పై కన్నేసి గుట్టు చప్పుడు కాకుండా లారీలు, టిప్పర్లతో సిద్దపేటలోని ఎల్యాలపల్లి ప్రాజెక్టుకు తరలించేందుకు సిద్ధమయ్యాడు. నకిలీ పత్రాలను సృష్టించి టిప్పర్లు, లారీల్లో ఇసుకను తరలిస్తుండగా ఆదివారం ఉదయం బ్లూకోల్ట్స్ సిబ్బంది పట్టుకున్నారు. అనుమతిపత్రాలు సరిగాలేని రెండు టిప్పర్లను ఠాణాకు తరలించారు. మరో రెండు టిప్పర్లను ఇసుకలోడ్‌తో ప్లాంట్ వద్దే నిలిపివేశారు.
రెండు టిప్పర్లను పట్టుకొన్నాం..
ఇసుకను తరలిస్తున్న వాహనాలను తనిఖీ చేశాం. అనుమతి ఉన్న పత్రాలు సరిగా లేకపోవడంతో రెండు టిప్పర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించాం. వెరిఫికేషన్ కోసం మైనింగ్ అధికారులతో పాటు ప్రాజెక్టు అధికారులకు పంపించినం. వారు ఇవి నకిలీ పత్రాలు నిర్ధారిస్తే కేసు నమోదు చేస్తాం.
– శేఖర్‌రెడ్డి, ఎస్ఐ (కోనరావుపేట)
పర్మిషన్ ఇవ్వలేదు..
నిమ్మపల్లి మెగా ప్లాంట్‌లో వద్ద గల డంప్ నుంచి ఇసుకను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయితే ప్రాజెక్టు వద్ద నిల్వ చేసిన ఇసుకను తరలించేందుకు ఒక రోజు ముందు ఫోన్ చేశారు. కానీ ఇతర ప్రాంతాలను తరలించడానికి కలెక్టర్, మైనింగ్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పిన. కిందిస్థాయి అధికారులకు కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు.
-అమరేందర్‌రెడ్డి, ప్యాకేజ్-9, ఈఈ