Smile Please | కోల్ సిటీ, మే 4 : సినిమాలో ఏదైనా కామెడీ సీన్ వస్తే చాలు… కడుపుబ్బా నవ్వుతాం కదా… కానీ, గోదావరిఖని స్మైల్ ప్లీజ్ సభ్యులు మాత్రం నిజంగా కామెడీ సినిమా చూపించారు. అదరగొట్టే జోక్స్ తో సందడి చేశారు. జోరుగా… హుషారుగా.. ఆనందంగా గడిపారు. ప్రపంచ నవ్వుల దినోత్సవం పురస్కరించుకొని గోదావరిఖనిలోని ఓ వృద్ధాశ్రమంలో ఆదివారం స్థానిక స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ సభ్యులు ‘నవ్వుల నజరానా- హాస్యవల్లరి’ నిర్వహించారు.
ఉదయం నుంచి సాయంత్రం దాకా కామెడీ ప్రదర్శనలతో అలరించారు. ఒక్కొక్కరుగా చెప్పిన జోక్స్ తో సభ్యులంతా కడుపుబ్బా నవ్వి ఆనందంను ఆస్వాదించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మేజిక్ రాజా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో తీవ్ర ఒత్తిళ్లకు గురవుతూ అసలు నవ్వడమే మరిచిపోతున్నారని, తద్వారా బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని, ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు మందుల కోసం ఖర్చు చేయడం కంటే అప్పుడప్పుడు తీరిక సమయాల్లో మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు దివ్యమైన ఔషధంగా నవ్వు తే చాలు అన్నారు. కృత్రిమంగా కాసేపు నవ్వినా ఫీల్ గుడ్ హార్మోన్స్ శరీరంలో విడుదలై మనిషి ఆరోగ్యంగా ఉంటాడనీ, నవ్వితే హ్యాపీ.. సవ్వకపోతే బీపీ అని పలువురు వైద్యులు సూచించారు.
నవ్వు ప్రయోజనాలను అందరికీ తెలిపేందుకే 1998లో డాక్టర్ మదన్ కటారియా జనవరి 10న మొదటిసారిగా లాఫింగ్ యోగా పేరుతో నవ్వుల దినోత్సవం నిర్వహించారని గుర్తు చేశారు. రామగుండం ప్రజలకు నవ్వులు పంచడం కోసం తాము 2007, డిసెంబర్ 16న స్మైల్ ప్లీజ్ క్లబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాలలో ప్రతీ ఏటా హాస్యవల్లరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కాగా, నవ్వు ప్రాముఖ్యతను, ఆవశ్యకతను చాటుతూ స్మైల్ ప్లీజ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హాస్యవల్లరి ప్రదర్శన ప్రాధాన్యతను చాటుకుంది.
ఈ కార్యక్రమంలో మేజిక్ రాజా, చంద్రపాల్, దయానంద్ గాంధీ, విజయ్‌కుమార్, మేజిక్ హరి, మొగురం గట్టయ్య, లెనిన్, పీటీ స్వామి, గంట సత్తయ్య, సత్యనారాయణ, కోట శ్రీనివాస రావు, వెంకట్ గౌడ్, సీతారాం రెడ్డి, జై హింద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆశ్రమ వృద్ధులకు అన్నదానం చేశారు.