Police Harassment | వేములవాడ, ఏప్రిల్ 2 : భీమేశ్వర ఆలయం వద్ద చిరు వ్యాపారం చేసుకునే తనను కమీషన్ కావాలని పోలీసులు వేధిస్తున్నందునే ఆత్మహత్యయత్నం చేసుకున్నానని బాధితుడు తాళ్లపల్లి రాజు పేర్కొన్నారు. గతంలో రాజన్న ఆలయం వద్ద కవర్లు, పేలాల ముద్దలు అమ్ముకుని చిరు వ్యాపారం చేసే రాజు ప్రస్తుతం భీమేశ్వర ఆలయ సమీపంలో ఇదే వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే రోడ్డు మీద వ్యాపారం చేస్తున్నామని పోలీసులు బెదిరిస్తూ కమిషన్ అడుగుతున్నారని బాధితుడు రాజు గురువారం గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తనను వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా వేధిస్తూ కమిషన్ ఇవ్వాలని వేధిస్తున్నందునే తాను ఆత్మహత్య పాల్పడ్డానని తెలిపాడు. అసలే వ్యాపారం లేక కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా ఉందని వాపోయాడు. ఈ విషయమై పట్టణ సీఐ వీరప్రసాద్ ను వివరణ కోరగా అతిగా మద్యం సేవించి గతంలోనూ రాజు ఆత్మహత్యాయత్నం పాల్పడ్డాడని తెలిపారు. ఎవరైనా రాజుని వేధిస్తే ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజు ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.