రాష్ట్ర సర్కారు ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అందుకు రేషన్‌కార్డుతోపాటు ఆధార్‌కార్డు ప్రతిని పొందుపరచాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవాలని ప్రచారం సాగుతుండడంతో చాలా మంది సెంటర్లకు పరుగులు తీస్తున్నరు. అడ్రస్‌లు, పేర్లు, ఫోన్ నంబర్లు ఇతరాత్ర మార్పులతో కొత్త కార్డులు పొందేందుకు ఎగబడుతున్నరు. ఒక్కో సెంటర్లో రోజుకు 50 నుంచి 60 కార్డులు మాత్రమే అప్డేట్ చేసే అవకాశమున్నా.. అంతకు మించి బారులు తీరుతున్నరు. గంటల కొద్దీ పడిగాపులు బేజారవుతున్నరు. అయితే ప్రస్తుత ఆరు గ్యారంటీలకు చేస్తున్న దరఖాస్తులకు ఆధార్ అప్డేట్ అవసరం లేదని అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా.. రెండు మూడు రోజులుగా ఆగమవుతున్నరు.
కరీంనగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/కార్పొరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆభయహస్తం పథకంలోని ఆరు గ్యారెంటీల అమలుకు ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అందుకు రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డు ప్రతిని జత చేయాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆధార్ అప్డేట్ ఉంటేనే ఆరు గ్యారెంటీలు వర్తిస్తాయని పుకారు లేచింది. రాష్ట్ర విభజనకు ముందే తీసుకున్న ఆధార్ కార్డులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నదని, ఇపుడు తెలంగాణ రాష్ట్రంగా అప్డేట్ చేసుకుంటేనే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు వర్తిస్తాయని.
అంతేకాకుండా కొత్తగా పెళ్లయిన యువతుల ఇంటి పేర్లు మార్చుకుంటేనే కొత్త రేషన్ కార్డులు ఇస్తారనే ప్రచారం జరిగింది. దీంతో రెండు మూడు రోజులుగా జనం తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకునేందుకు ఆధార్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇంకా ఆధార్‌కార్డు పొందినపుడు ఒక చోట ఉండి ఇపుడు మరోచోట నివసిస్తున్న వారు తమ అడ్రస్, ఫోన్ నంబర్లతోపాటు పేర్ల మార్పు కోసం వస్తున్నారు. ఇంకా ఇతరాత్ర చిన్న చిన్న మార్పులు చేసుకు నే వారు కూడా తరలి వస్తున్నారు. ఇటీవల పుట్టిన పిల్లలకు కార్డులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా, గడువులోగా ఆధా ర్ అప్డేట్ చేసుకునేందుకు జనం కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఉదయం 9గంటల నుంచే కేంద్రాలకు బారులు తీరుతున్నారు. సెంటర్లు తెరిచిన వెంటనే ఎగబడుతున్నారు. కొందరు విసిగివేసారిపోయి చెప్పులను క్యూ లో పెట్టి అక్కడే నీరిక్షిస్తున్నారు. కేంద్రాల వద్ద కనీస సదుపాయాలులేక తిప్పలు పడుతున్నారు. ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు కరీంనగర్లో 3ప్రభుత్వ ఈ సేవా కేంద్రాలు, మరో 7ఆధార్ కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా, ఎక్కడ చూసినా పెద్దసంఖ్య లో కనిపిస్తున్నారు. ఒక్కో సెంటర్లో రోజుకు 50 నుంచి 60 కార్డులు మా త్రమే అప్డేట్ చేసే అవకాశము న్నా వందల సంఖ్యలో వస్తున్నారు. అధికారులు సైతం ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ అప్డేట్ విషయం లో స్పష్టత ఇవ్వకపోవడంతో అర్జీదారులు పరేషాన్ అవుతున్నారు.

ఆధార్ అప్డేట్ కోసం తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాల్సి వస్తున్నది. అందుకు కోసం ఒక్కొక్కరికీ కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం తీసుకుంటున్నది. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ టైం పడుతున్నది. ఈ మధ్యలో నెట్వర్క్ ప్రాబ్లం వస్తే ఇంకా ఎంత టైం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఇదే సమయంలో కేంద్రాలకు వందలాదిగా తాకిడి ఉంటున్నది. దీంతో కొందరు పొద్దంతా కేంద్రాల వద్దనే ఉండాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా బారులు తీరుతుండగా, శుక్రవారం జిల్లా కేంద్రమైన కరీంనగర్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. కార్పొరేషన్ ఆఫీస్ వద్ద, చైతన్యపురి, తెలంగాణ చౌక్, రేకుర్తి తదితర సెంటర్ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
ఆధార్ అప్డేట్ తప్పనిసరి కాకున్నా పుకార్లను నమ్మి జనం తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో జనం తమ సెంటర్ల వద్దకు వస్తుండడంతో నిర్వాహకులకు సైతం ఇబ్బందికి గురవుతున్నారు. ఒక్కో సెంటర్లో రోజుకు 50 నుంచి 60 ఆధార్ కార్డులు మాత్రమే అప్డేట్ చేసే అవకాశం అవకాశమున్నదని, కానీ అంతకు మించి జనం వస్తుండడంతో నిర్వాహకులు సైతం చేతులెత్తేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంగానీ, జిల్లా యంత్రాంగంగానీ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఆరు గ్యారెంటీల విధివిధానాల్లో స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కరీంనగర్ : చైతన్యపురిలోని మీ సేవా కార్యాలయంలో ఆధార్ అనుసంధానం చేసుకుంటున్న ప్రజలుఅవగాహన లేకనే అవస్థలు ఆధార్ అప్డేట్పై అవగాహన లేకనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆధార్ పొంది పదేళ్లు దాటిన వారు అప్డేట్ చేసుకోవాలని ఉన్నది. కానీ దానికి గడువు కూడా ఇచ్చారు. కానీ, ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే ఆరు గ్యారెంటీలు వర్తిస్తాయని సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు సమాచారంతో ప్రజలు అప్డేట్ కోసం ఎగబడుతున్నారు. కొన్ని శాఖలు వారికి అనుగుణంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉన్నది. పోస్ట్ ఆఫీసులు, బ్యాంకుల్లో కూడా ఈ సదుపాయం ఉన్నది. కానీ, ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఆధార్ కేంద్రాల్లోనే అప్డేట్ చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ అప్డేట్ చేసుకోవాలని ఎక్కడా చెప్పలేదు. పుకార్లు నమ్మి ఇబ్బందులు పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి.
– శ్రీరాం శ్రీనివాస్ రెడ్డి, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ (కరీంనగర్)
ఆధార్ అప్డేట్ ఉంటేనే ఆరు గ్యారంటీలకు అర్హులని ఎవరో పుకార్లు పుట్టించారు. దీంతో జనాలంతా వచ్చి మా సెంటర్ల మీద పడుతున్నారు. సెంటర్లు చూస్తే తక్కువగా ఉన్నాయి. మాకున్న సదుపాయాలు, నెట్వర్క్ సరిగ్గా ఉంటే రోజుకు 50 నుంచి 60 కార్డులు మాత్రమే అప్డేట్ చేయగలుగుతాం. అంతకు మించి చేయడం ఎవరి తరం కాదు. కానీ, ఒక్కో సెంటర్‌కు వంద రెండు వందల మంది వస్తున్నారు. ఇంత మందికి సర్వీస్ ఇవ్వడం మాతో కావడం లేదు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ అప్డేట్ చేసుకోవాలని ఎక్కడా చెప్పలేదు. అయినా జనాలు అప్డేట్ కోసం ఎగబడుతున్నారు. దయచేసి మా పరిస్థితి కూడా అర్ధం చేసుకోవాలి. తప్పని సరి అయితే ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇస్తుంది. అందుకు అనుగుణంగా మేం సర్వీస్ ఇస్తాం.
– దాస్యం రాజు, మీసేవా, ఆధార్ కార్డు సెంటర్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు