కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా టాప్ టెన్‌లో నిలించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో స్థానం, కరీంనగర్ ఏడో స్థానం, పెద్దపల్లి ఎనిమిదో స్థానం సాధించగా, జగిత్యాల 11వ స్థానం దక్కించుకున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 6,470 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 6,358 మంది (98.27శాతం) ఉత్తీర్ణత సాధించారు. కరీంనగర్ జిల్లా నుంచి 12,555 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 12,134 మంది (96.65 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పెద్దపల్లి జిల్లా నుంచి 7,716 మంది పరీక్ష రాయగా.. 7,432 మంది (96.32 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇక జగిత్యాల జిల్లా నుంచి 11,380 మంది పరీక్ష రాయగా, 10,898 మంది (95.76 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు.
బాలికలదే పైచేయి
పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలురు 97.43 శాతం కాగా, బాలికలు 99.03 శాతం ఉత్తీర్ణతతో ముందు నిలిచారు. కరీంనగర్ జిల్లాలో బాలురు 95.85 శాతం కాగా, బాలికలు 97.55 శాతంతో పైచేయి సాధించారు. పెద్దపల్లి జిల్లాలో బాలురు 95.20 శాతం కాగా, బాలికలు 97.45 శాతంతో ముందుంజలో నిలిచారు. జగిత్యాల జిల్లాలో బాలురు 94.90 శాతం కాగా, బాలికలు 96.62 శాతంతో పైచేయి సాధించారు.
సర్కారు విద్యార్థుల సత్తా
పది ఫలితాల్లో సర్కారు పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. కొత్తపల్లి మండలం ఎలగందుల మోడల్ విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించగా, అందులో ఆరుగురు 10 జీపీఏ, ఐదుగురు 9.8 జీపీఏ సాధించారు. 10 జీపీఏ సాధించిన బాకారపు అఖిల, కొండపల్లి సారథి, నర్సింగోజు దేవిశ్రీ సత్య, పెందోట సృజనశ్రీ, పురుషోత్తం ఐశ్వర్య, తాటికొండ అశ్వితతోపాటు ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రిన్సిపాల్ వీ సరిత, డీఈవో జనార్దన్‌రావు, ఎంఈవో మధుసూధనాచారి, అధ్యాపకులు అభినందించారు. అలాగే కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, అందులో 9.8 జీపీఏ సాధించిన ఈ సాయితేజను డీవైఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, అధ్యాపకులు అభినందించారు.
17లోగా సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలి
పది ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 17వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలని కరీంనగర్ డీఈవో జనార్ధన్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపరాధ రుసుం 50తో పరీక్షకు రెండు రోజుల ముందు వరకు చెల్లించవచ్చని, రీకౌంటింగ్ కోసం సబ్జెక్ట్‌కు 500, రీ వేరిఫికేషన్ కోసం 1000 ఫీజును 15వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.bse.telangana.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చని చెప్పారు. అలాగే, ఉత్తమ ఫలితాలను సాధనకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులను, బోధన, బోధనేతర సిబ్బందికి, 100 శాతం ఫలితాల సాధనకు కృషి పాఠశాలకు శుభాకాంక్షలు తెలిపారు.