Ramakrishna Colony | తిమ్మాపూర్, జూన్ 14 : తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం సంఘం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా సిరికొండ వెంకట్రావు వరుసగా తొమ్మిదో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకు ముందు సిరికొండ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ అభివృద్ధి కార్యక్రమాలు, వార్షిక నివేదిక, ఆడిట్ నివేదిక, ఆర్థిక వ్యవహారాలు, ఇతర ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అలాగే సంఘానికి అత్యధికంగా పాలు పోసిన సభ్యులను గుర్తించి, వారి సేవలను అభినందిస్తూ ప్రత్యేక బహుమతులు అందజేశారు. సమావేశానికి హాజరైన సభ్యులు సంఘ అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా తనను మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు సిరికొండ వెంకట్రావ్వ ధన్యవాదాలు తెలిపారు. సంఘ అభివృద్ధికి మరింత కృషి చేస్తూ, సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.