Sircilla | సిరిసిల్ల టౌన్, ఆగస్టు 31 : సిరిసిల్లను డ్రగ్ ఫ్రీ సిటిగా ప్రకటిస్తూ పాలకవర్గం తీర్మానం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ జిందం కళ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సాధన సమావేశం సోమవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాలకవర్గం ఆమోదం తెలిపిన అజెండా అంశాలను చైర్మన్ వెల్లడించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. రాబోవు బతుకమ్మ, వినాయక చవితి వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు.
సానిటేషన్, వీధి దీపాలు తదితర అవసరాల కోసం నిధులు వార్డుల వారీగా ఇస్తున్నామని చెప్పారు. మున్సిపల్ పరిధిలోని 39 వార్డులలో ప్రజలకు వందశాతం మాలిక వసతులు కల్పించడం లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తున్నదని చెప్పారు. మున్సిపల్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కమిషనర్ ఖదీర్ పాషా, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.