Sircilla | సిరిసిల్ల టౌన్ ఏప్రిల్ 27: బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు అందజేసేందుకు సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ వెండి పట్టు పోగులతో ప్రత్యేక శాలువా తయారు చేసి మరో అద్భుతం సృష్టించాడు.
బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆదేశాల మేరకు చేనేత కార్మికుడు హరిప్రసాద్ దాదాపు ఐదు రోజుల పాటు శ్రమించి, 32 గ్రాముల వెండి, పట్టు దారాలతో నేయడం ద్వారా ఈ ప్రత్యేక శాలువాను రూపొందించాడు. ఈ శాలువా 2.5 మీటర్ల పొడవు, 46 అంగుళాల వెడల్పుతో ఉండేలా తయారు చేశాడు.
వెండి పట్టు దారాలతో కేసీఆర్ ముఖచిత్రం, వరంగల్ కాకతీయ కామన్, సిల్వర్ జూబ్లీ లోగోలు రెండూ అద్భుతంగా నేశారు. ఈ ప్రత్యేకమైన శాలువాను వరంగల్ సభలో జిందం చక్రపాణి ఆదివారం కేసీఆర్ కు అందించనున్నారు.
హరిప్రసాద్ కు కేటీఆర్ ప్రశంస
కేసీఆర్ కోసం అందంగా రూపొందించిన కళా ఖండాన్ని నేసిన అత్యంత ప్రతిభావంతులైన కళాకారుడు హరి ప్రసాద్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా అభినందించారు. అలాగే పలువురు నేతలు సైతం అభినందనలు తెలిపారు.