Godavarikhani | కోల్ సిటీ, జూలై 19: ‘అయ్యా.. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక విన్నపం.. రామగుండంలో ప్రొటోకాల్ విస్మరించి ఇక్కడి మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ తోపాటు మరో నలుగురు అధికారులు మీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు పిలిచి వేదికలపై కుర్చీలు వేసి ముందు వరుసలో కూర్చోబెట్టి వారు మాత్రం వెనుకబడిపోతున్నారు. మీ పార్టీకి చెందిన ఓ నాయకుడు చెప్పినట్టు నడుచుకుంటూ విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న ఓ అధికారికి పదోన్నతి ఇచ్చారు. ఇంతగా మీ పార్టీకి సేవలందిస్తున్న వారు కండువా లేని కార్యకర్తలుగానే మిగిలిపోవాలా.. దయేదసి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్ష పదవితోపాటు మిగతా నలుగురు అధికారులకు కీలక పదవులు ఇవ్వాలని ఇదే నా విన్నపం..’ అంటూ రామగుండం నగర పాలక సంస్థ 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు శనివారం సంచలన ప్రకటన చేశారు.
స్వయంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ కు లేఖ రాయడంతో పాటు రిజిస్టర్ పోస్టు కూడా చేసినట్లు తెలిపారు. ఆ పోస్టులోని సారాంశాలపై జిల్లా రాజకీయ పార్టీలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ శుక్రవారం గోదావరిఖనిలో జరిగిన వన మహోత్సవం అధికారిక కార్యక్రమంలో వేదికపై స్థానిక ఎమ్మెల్యే పక్కనే కాంగ్రెస్ పార్టీ నాయకులను కూర్చోబెట్టి మున్సిపల్ అధికారులు మాత్రం వెనకాల ఉండటం విస్మయానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ అమలులో రామగుండం మున్సిపాలిటికి మినహాయింపు ఉన్నట్లు వ్యవహరించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను కలుపుకుంటూ అధికారిక కార్యక్రమాలకు గౌరవంగా ఆహ్వానిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అంతేగాక విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటూ కాంగ్రెస్ నాయకుడికి నమ్మిన బంటుగా ఉన్న ఓ అధికారికి పదోన్నతి కూడా కల్పించారని ఆరోపించారు. నగరంలో ప్రొటోకాల్ ను పకడ్బందీగా అమలు చేయాల్సిన అదనపు కలెక్టర్ కూడా కాంగ్రెస్ నాయకులకే ప్రాధాన్యత ఇవ్వడం విచారకరమని పేర్కొన్నారు. ఆ పార్టీకి ఇతోధికంగా సేవలందిస్తున్న స్థానిక మున్సిపల్ అధికారులకు రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ లో ప్రత్యక్ష పదవులు ఇవ్వాలని తాను పీసీసీ అధ్యక్షుడికి రిజిస్టర్ పోస్టు ద్వారా కోరడంలో తప్పు లేదని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.