Singareni workers | గోదావరిఖని : సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలు ప్రకటించకుండా తప్పుడు లాభాలు ప్రకటించి కార్మికులను మోసం చేసిందని సిఐటియు సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగిసి నెలలు గడుస్తున్నప్పటికీ కార్మికులు కార్మిక సంఘాల ఆందోళన పోరాటాల ఫలితంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో జరిగిన సమావేశంలో లాభాలు ప్రకటించడం జరిగిందని 2024-25 ఆర్థిక సంవత్సరం వాస్తవ లాభాలు రూ.6394 కోట్లుగా ఉంటే అందులో రూ.4034 కోట్లు పక్కనపెట్టి రూ.2360 కోట్లపై 34 శాతం రూ.802.40 కోట్లు కార్మికులకు చెల్లించడాని ప్రకటించడం జరిగిందని తెలిపారు.
అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు గతంలో రూ.5వేలు చెల్లిస్తే ఈసారి రూ.5500 చెల్లించడానికి నిర్ణయించి పర్మినెంట్ కార్మికులకు ఇటు కాంట్రాక్ట్ కార్మికులకు నిరాశ మిగిల్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ లాభాలు దాచిపెట్టి ఇన్ని రోజులు కార్మికులను కార్మిక సంఘాలను ఆందోళన బాట పట్టించి చివరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యాన్ని కల్పించి కార్మికులను మరోసారి మోసం చేయడానికి కారణమైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను కార్మికులు నిలదీయాలని కోరారు. ఈ లాభాల ప్రకటన సందర్భంగా కార్మికులు ఆశించిన విధంగా మారుపేరుల సమస్య పరిష్కారం, సొంతింటి పథకం అమలు, రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ రూ.42 వేల కోట్ల చెల్లింపు, అలవెన్స్లపై ఇన్కమ్ టాక్స్ కార్మికులకు తిరిగి చెల్లింపు, దసరా సెలవు అక్టోబర్ 3న ఇవ్వడానికి అంగీకారం తదితర అంశాలపై పరిష్కారం దొరుకుతుందని ఆశించిన కార్మికులకు నిరాశ మిగిల్చిందని తెలియజేశారు.
ఇప్పటికైనా గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజకీయ జోక్యాన్ని తగ్గించడానికి ఐక్య పోరాటాలే పరిష్కారం అన్న విషయం గుర్తుంచుకోవాలని లాభాల ప్రకటన కొండంతవి ఎలుకను పట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. గత సంవత్సరం లాభాలు పంచాంగ మిగిలిన డబ్బులు ఈ సంవత్సరం మిగిలిన డబ్బులు అసలు ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితులలో ఉందని ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సింగరేణి లాభాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.