Budhavarampet | రామగిరి, డిసెంబర్ 18: తమ గ్రామం సింగరేణి జాగీరు కాదని, మా భూములు ఇవ్వబోమని బుధవారంపేట గ్రామస్తులు స్పష్టం చేశారు. బుధవారంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములు, గ్రామంలోని ఇండ్లను సైతం స్వాధీనం చేసుకునేందుకు సింగరేణి సంస్థ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు.
గత 15 సంవత్సరాల క్రితం బుధవారంపేట గ్రామపంచాయతీ పరిధిలోని 708 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు గ్రామంలోని ఇండ్లను కూడా తీసుకుంటామని నోటిఫికేషన్లు జారీ చేసి, డీఎన్, డీడీ ప్రక్రియ పూర్తి చేసి అవార్డు పాస్ చేయడం జరిగింది. అయితే భూములకు ఇచ్చే పరిహారంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రైతులు కోర్టును ఆశ్రయించారు.
కోర్టు తీర్పు మేరకు అవార్డు రద్దు కాగా, సింగరేణి స్వాధీనంలో ఉన్న భూములను రైతుల పేర్లకు మార్చాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో రెవెన్యూ అధికారులు టీఎం-33 ప్రక్రియ ద్వారా మోకా సర్వే నిర్వహించి కొంతమంది రైతుల భూములను మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. మిగతా రైతులు ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని వాపోతున్నారు.
ఈ సమస్య అలాగే ఉండగానే, ఇటీవల బుధవారంపేట పరిధిలోని 88 ఎకరాల భూమిని అవార్డు చేసి స్వాధీనం చేసుకున్నారని, ఇంకా 444 ఎకరాల వ్యవసాయ భూమిని మాత్రమే తీసుకుంటామని హద్దులు నిర్ణయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉండగా, గ్రామపంచాయతీకి ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, గ్రామసభ లేదా సమావేశం నిర్వహించకుండా, రాత్రికి రాత్రే గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా మైక్ అనౌన్స్మెంట్ చేయించి, మరుసటి రోజు ఉదయం ఇండ్లకు నెంబర్లు వేయడాన్ని అడ్డుకున్నారు.