గోదావరిఖని, డిసెంబర్ 8 : తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధి.. 11 డివిజన్లలో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. సంస్థలో పనిచేస్తున్న 39,832 మంది కార్మికులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఈ నెల 4న అన్ని కార్మిక సంఘాల నాయకులతో హైదరాబాద్‌లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమీషనర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితాను అందజేసిన విషయం తెలిసిందే.
సింగరేణిలో నాలుగు సార్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ), రెండు సార్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)లు గుర్తింపు కార్మిక సంఘం హోదాలో కొనసాగాయి. ప్రస్తుతం ఏడవ సారి జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపొందేందుకు సంఘాలు పోటీ పడుతున్నాయి. అక్టోబర్ 19న సింగరేణి ఎన్నికలు జరపాలని డిప్యూటీ చీఫ్ లేబర్ కమీషన్ నిర్ణయించగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా డిసెంబర్ 27కు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.
సింగరేణి కాలరీస్‌లో ప్రభుత్వం 1998లో తొలిసారిగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించింది. 1998కి ముందు కంపెనీలో సుమారు 78 కార్మిక సంఘాలు కార్యకలాపాలు నిర్వహించేవి. దీంతో ప్రతీ సంఘంతో యాజమా న్యం సంప్రదింపులు జరపడం ఇబ్బందిగా మారి పారిశ్రామిక సంబంధాలకు విఘాతం కలిగేది. మాటి మాటికి సమ్మెలు జరిగేవి. దీంతో ప్రభు త్వం సింగరేణిలో 1998లో తొలిసారిగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి గెలిచిన సం ఘంతో మా త్రమే సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలిసారి 1998లో ఎన్నికలు నిర్వహించగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) విజయం సాధించింది.
అప్పుడు గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి రెండేళ్లు ఉండేది. అనంతరం 2001 లో రెండో సారి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మళ్లీ అదే యూనియన్ రెండేళ్ల కాలపరిమితితో గెలుపొందింది. మూడవ సారి 2003లో ఎన్నికలు జరగగా మళ్లీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గెలుపొందగా ప్రభుత్వం అప్పుడు నాలుగేళ్ల కాలపరిమితిని నిర్ణయించింది. అనంతరం 2007 లో నాలుగో సారి మళ్లీ అదే సంఘం విజయం సాధించింది. ఈ క్ర మంలో నాలుగు సార్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘంగా కొనసాగింది. 2012లో ఐదవ సారి జరిగిన గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) విజయవం సాధించింది. అనంతరం 2017 లో జరిగిన ఆరవ సారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మళ్లీ టీబీజీకేఎస్ విజయం సాధించింది. ప్రస్తుతం ఏడవ సారి సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి.
సింగరేణిలోని 11 డివిజన్లలో 39,832 మం ది సింగరేణి కార్మికులు పనిచేస్తూ ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బెల్లంపల్లి ఏరియాలో 985 మంది, మందమర్రిలో 4876 మంది, శ్రీరాంపూర్‌లో 9124 మంది, కార్పొరేట్లో 1112 మంది, కొత్తగూడెంలో 2370 మంది, ఇల్లందు లో 603 మంది, మణుగూరులో 2414 మంది, రామగుండం-1లో 5430 మంది, రామగుండం-2లో 3479 మంది, రామగుండం-3లో 3063 మంది, భూపాలపల్లిలో 5350 మందితో పాటు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో 944 మంది, నైనిలో ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నారు.
కాగా సింగరేణిలోని మందమర్రి, శ్రీరాంపూర్, ఆర్జీ-1, భూపాలపల్లి డివిజన్లలో అత్యధికంగా కార్మికులు పనిచేస్తున్నారు. గుర్తింపు ఎన్నికల్లో గెలుపు, ఓటములను నిర్ణయించే ఈ నాలుగు డివిజన్లపైనే కార్మిక సంఘాలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. గతంలో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో ఈ 4 డివిజన్లు గెలుపు బాటలు వేశాయి.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా దృష్టి సారించారు. కోల్‌బెల్ట్ ఏరియా టీబీజీకేఎస్ నేతలతో ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. టీబీజీకేఎస్ అగ్రనేతలు వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్యతో ప్రత్యేకంగా భేటీ అయి పరిస్థితులపై దిశానిర్దేశం చేస్తున్నారు. సింగరేణిలోని భూపాలపల్లి, మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం డివిజన్లకు చెందిన టీబీజీకేఎస్ ముఖ్య నాయకులతో రివ్యూ నిర్వహించారు. క్రమక్రమంగా మిగిలిన డివిజన్ల నాయకులతో సమీక్షలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ముఖ్యంగా సింగరేణిలో వారసత్వపు ఉద్యోగాలు పోగొట్టిన జాతీయ సంఘాల పనితీరును ఎండగట్టాలని, వారసత్వపు ఉద్యోగాలు ఇప్పించిన టీబీజీకేఎస్ గురించి కార్మికులకు వివరించాలని సూచిస్తున్నారు. అదే విధంగా మనం సాధించిన ప్రతీ హక్కును కార్మికులకు అర్థమయ్యే లా చెప్పాలని కోరుతున్నారు. రాష్ట్రంలో పార్టీ ఓట మి పాలైందని ఎవరూ బాధపడవద్దని, అధైర్య పడవద్దని, ఎలాంటి సపోర్టు లేనప్పుడే కొట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నామని, అదే స్ఫూర్తితో ముందుకు సాగుదామని టీబీజీకేఎస్ నాయకుల్లో కవిత ధైర్యం నింపుతున్నారు. ఓడినా ఎల్లప్పుడూ మీ ముందే ఉంటామని, ప్రజల, కార్మికుల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామని, పార్టీ కార్యకర్తలు యూనియన్ నాయకులను కం టికి రెప్పలా కాపాడుకుంటామని వెల్లడిస్తున్నారు.
తెలంగాణకే తలమానికం అయిన సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని సింగరేణి సంస్థ ఇతర యూనియన్లు, పార్టీల చేతిలోకి వెళ్తే సంస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని కవిత నాయకులకు తెలిపారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో పట్టుదలతో ముందుకు సాగాలని ఏరియాల వారీగా ఇన్చార్జిలను నియమిస్తామని, త్వ రలో మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని ఎమ్మెల్సీ కవిత నాయకులకు తెలిపారు. అదే విధంగా సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదేనని చెబుతున్నారు.
యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వ బాధ్యతల్లోనూ అత్యంత ప్రాధాన్యత ఇస్తామని హామీనిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చొరవతో సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయని, టీబీజీకేఎస్‌ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. సంస్థను నష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ను కార్మికులు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.