గంగాధర, జనవరి 14 : సంక్రాంతి పండుగ, మేడారం జాతర కోసం ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళుతున్నారా? అయితే మీ ఇంటిని భద్రంగా ఉంచుకోవాలని కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ బుధవారం ప్రకటనలో సూచించారు. ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన ఆభరణాలు, నగదును ఇంటిలో పెట్టకుండా వెంట తీసుకెళ్లడంగాని, బ్యాంక్ లాకర్లలో ఉంచడం గాని శ్రేయస్కరమన్నారు. ఇంటికి సెంట్రల్ లాకింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పండుగకు, జాతరకు వెళ్లేవారు తమ పర్యటన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని సూచించారు. పర్యటన వివరాలను సోషల్ మీడియాలో చూసిన దొంగలు ఇంటిలో దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. గ్రామంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల గురించి స్థానిక పోలీసులకు గాని, డయల్ 100కు గాని కాల్ సమాచారం ఇవ్వాలని సూచించారు.