Godavarikhani | గోదావరిఖని : పెద్దపెల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణకు రామగుండంలో ప్రొటోకాల్ ఉండదా…? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా…? లేనట్లా…? అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పాలని సీనియర్ కాంగ్రెస్ నేత గుమ్మడి కుమారస్వామి డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రులు పర్యటించిన ఇతర ఎలాంటి ముఖ్య కార్యక్రమాలు జరిగిన ఎంపీ వంశీకృష్ణకు అసలు సమాచారమే లేకుండా పోతుందని, దళిత ఎంపీకి ప్రొటోకాల్ వర్తించదా…? అనే విధంగా చర్చ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్, ఇతర అధికారులు ఎందుకు ప్రొటోకాల్ పాటించడం లేదో..? ఈ వ్యవహారంలో ఎవరున్నారో తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గానికి మంత్రులు వచ్చినా, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరిగినా ఎంపీకి సమాచారం ఉండకపోవడంతో పాటు ప్రొటోకాల్ ను తుంగలో తొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రొటోకాల్ పాటించని విషయమై సాక్షాత్తు పెద్దపెల్లికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఎంపీ వంశీకృష్ణ తీసుకువెళ్లినా ఆయన నుంచి స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క వచ్చినా కార్యక్రమానికి ఎంపీకి ఆహ్వానం లేదని, ఇదే విషయమై డిప్యూటీ సీఎంకు ఎంపీ ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. గోదావరిఖనిలో మంత్రి వివేక్ కు సన్మానం చేసే కార్యక్రమానికి మాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. కాంగ్రెస్ కొంతమంది టేకేదారుల పార్టీనా అని ఆయన ప్రశ్నించారు.
రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న దందాలు కప్పిపుచ్చుకోవడానికి అవినీతి అక్రమాలు ఎంపీ ఎక్కడ బయటపెడతాడోనని, ఆయనను విస్మరిస్తున్నారనే విషయం అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత ఎంపీని ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తున్న విషయమే లోక్ సభ స్పీకర్ కు చీఫ్ సెక్రటరీకి ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ వాదిగా ముందుకు వెళుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపీసీ బూడిద వ్యవహారంలో నిర్వాసితులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని టెండర్లు కేటాయించిన బూడిద ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని, బూడిద వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. బూడిద వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని, ఈ విషయంలో ఎంపీ వంశీకృష్ణ సీరియస్గా ఉన్నారని ఆయన వివరించారు.