గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించిన 100 పడకల దవాఖానల్లో సిబ్బంది కొరత వేధిస్తున్నది. ఆధునిక హంగులతో భవనాలు సిద్ధమైనప్పటికీ అవసరమైన వైద్యులు, సిబ్బంది లేక ప్రజలకు ఆశించిన స్థాయిలో వైద్యం అందకుండా పోతున్నది. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్ విద్యానగర్, జూన్ 18: జిల్లాకేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు వైద్యులను తయారు చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలలపై వివక్ష చూపింది. అందులో పోస్టులు భర్తీ చేయకుండా చోద్యం చూసింది. తప్పని పరిస్థితుల్లో ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం.. వైద్య కళాశాలలకు అవసరమైన బోధన సిబ్బంది కోసం తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న పలువురు వైద్యులను బదిలీ చేసింది. దీంతో ఇప్పటికే సిబ్బంది కొరతతో తల్లడిల్లుతున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్సీలు), ఏరియా దవాఖానలు, 100 పడకల దవాఖానల్లో వైద్య సేవలు మరింత దెబ్బతిన్నాయి.
సాధారణంగా ప్రాథమిక వైద్యం కోసం పీహెచ్సీలు, ద్వితీయ స్థాయి వైద్యం కోసం సీహెచ్సీలు, ఏరియా దవాఖానలు, ప్రత్యేక వైద్య సేవల కోసం టీచింగ్ దవాఖానలకు రోగులు వస్తుంటారు. కానీ, ప్రస్తుతం మధ్యస్థాయి దవాఖానల్లో వైద్యులు లేకపోవడంతో చిన్నపాటి సమస్యలకే నేరుగా పెద్ద హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో టీచింగ్ హాస్పిటళ్లు రోగులతో కికిరిసిపోతుండగా, గ్రామీణ ప్రాంత ప్రజలకు సకాలంలో వైద్యం పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చొప్పదండి, వేములవాడ, మంథని ప్రాంతాలకు 100 పడకల దవాఖానలు, మానకొండూర్, జమ్మికుంట, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట ప్రాంతాలకు 50 పడకలు, గంగాధరలో 30 పడకల దవాఖానలు నిర్మించారు. అయితే అనేక చోట్ల భవనాలు సిద్ధమైనప్పటికీ స్పెషాలిటీ వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా పూర్తిస్థాయి సేవలు అందడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న స్పెషాలిటీ వైద్యులను అవసరమైన మేరకు 100 పడకల దవాఖానల్లో సర్దుబాటు చేసి, శాశ్వత ప్రాతిపదికన క్యాడర్ను భర్తీ చేస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని వైద్య సంఘాలు సూచిస్తున్నాయి. అలాగే పోస్టులను వెంటనే భర్తీ చేసి దవాఖానలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వైద్యుల బదిలీల్లో 400 మందికి పైగా వైద్యులకు స్థానచలనం కలిగినప్పటికీ సుమారు 125 మంది వైద్యుల విషయంలో సాంకేతిక లోపాలు, పరిపాలనా సమస్యలు తలెత్తినట్టు తెలుస్తున్నది.
వైద్యులతోపాటు ఇతర సిబ్బంది బదిలీల విషయంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర, జోనల్ స్థాయిల్లో ఆఫ్ లైన్ కౌన్సెలింగ్ ద్వారా సిబ్బంది సర్దుబాటు చేపడితే న్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. వానకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డెంగ్యూ, వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధులు పెరిగే ముప్పు ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్సీలు, ఏరియా దవాఖానలు, టీచింగ్ హాస్పిటళ్లలో సమానంగా వైద్యులు, సిబ్బందిని నియమించి వైద్య సేవలను బలోపేతం చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే గ్రామీణ ప్రాంతవాసులు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.