Jagityal |జగిత్యాల, ఆగస్టు 8 : జగిత్యాల పట్టణంలోని మార్కెట్లోని ప్రముఖ భవానీ శంకర శ్రీనివాస ఆంజనేయస్వామి దేవాలయంకి అడ్డంగా షెడ్లు వేసుకొని కూరగాయల దుకాణాలు నిర్వహిస్తూ భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆందోళనకు దిగారు. మార్కెట్లో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతీరోజు వందలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కోరిన కోర్కెలు తీరుతాయని ప్రతీ శనివారం 101 ప్రదక్షణలు చేస్తుంటారు.
వివిధ పండుగల సందర్భంలో వందలాదిమంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. అయితే కొంతమంది దేవాలయ ప్రవేశ ద్వారానికి ఆనుకొని అక్రమంగా షెడ్లు వేసుకొని కూరగాయల వ్యాపారాన్ని నిర్వహిస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, షెడ్లను పక్కకు జరిపించాలని గత కొంతకాలంగా మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో శనివారం ఆలయానికి వచ్చిన భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు, వివిధ హిందూ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున రోడ్డుమీదకు వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
దేవాలయం ముందు వ్యాపారుల షెడ్లను తొలగించి దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆలయ ఈవో మున్సిపల్ కమిషనర్ ను లిఖిత పూర్వకంగా కోరారు. భక్తుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు చేరుకొని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో దేవాలయం ముందు ఉన్న షెడ్లను తొలగిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో భక్తులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.