ముత్తారం, మార్చి 11: ఏడాదిన్నర క్రితం వరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో గోదావరి నిండు కుండలా ఉండేది. పరీవాహక గ్రామాల్లో భూగర్భజలాలు పైపైనే కనిపించేవి. చెరువులు, కుంటలే కాదు బోర్లు, బావులు నిండుగా ఉండేవి. అప్పుడు సమృద్ధిగా నీళ్లంది భూములు సస్యశ్యామలమయ్యాయి. ఇలానే ముత్తారం మండలంలోనూ పుష్కలమైన పంటలు పండాయి. కానీ, ప్రస్తుతం పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ వివక్ష వల్ల గోదావరి నీటిని దిగువకు వదలడంతో ఎడారిని తలపిస్తున్నది. దీంతో సమీప అడవిశ్రీరాంపూర్ పరిసరాల్లో భూగర్భజలాలు అడుగంటాయి. శివారులోని బర్రెమడుగులో 30 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. మరో వంద ఎకరాలు ఎండిపోయే పరిస్థితులున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు దాదాపు 30లక్షలు ఖర్చు పెట్టి, కొత్తగా 50 బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. ఇటు ఎస్సారెస్పీ కాలువ ఉన్నా ఇప్పటి వరకు చుక నీరు రాలేదు.
శుక్రవారంపేటలోని 2 టీఎంసీ రిజర్వాయర్ నుంచి మండలంలోని చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వడం లేదు. బర్రెమడుగు శివారులోని అటవీప్రాంతంలో కొత్తమాటు చెరువుకు నీళ్లిచ్చినా భూగర్భజలాలు పెరిగేవి. కానీ, కానీ ఈ చెరువులోకి నీటిని తీసుకొచ్చే కాలువ పూర్తి కాకపోవడంతో నీరిచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పంటలు ఎండుతుండగా, రైతులు ఆగమవుతున్నారు. చేసేదేమీ లేక పంటలను పశువులకు వదిలేస్తున్నారు. ఎకరాకు 25వేల నుంచి 30 వేల వరకు పెట్టుబడి నష్టపోయామని కన్నీటి పర్యంతమవుతున్నారు. పంటలు నష్టపోవడం పదేళ్లలో ఇదే మొదటి సారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, నీళ్లిచ్చి పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
మూడెకరాలు నాటు వేసినం. పొలం చేతికచ్చే దశలో మొత్తం ఎండిపోయింది. చేసిన కష్టం రాళ్లపాలు అయినట్టు అయింది. ఉన్న బోరు ఎండిపోవడంతో మళ్లీ ఇంకో బోరు వేసినం. దానికి లక్ష రుపాయాలు అయింది. కానీ చుక నీరు రాలేదు. పెట్టిన లక్ష పెట్టుబడి నష్టపోయినం. పూర్తిగా ఎండిన పంటపొలాలను ప్రభుత్వం సర్వే చేయించాలి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి.
– నిమ్మతి ప్రమీల, మహిళా రైతు (అడవిశ్రీరాంపూర్)
ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిండు కుండలా ఉండేది. వానకాలంలో అయితే నా బోరు మోటర్ లేకుండానే నీరు పైకి ఉబికి వచ్చేంది. నా రెండున్నర ఎకరాల పొలం మొత్తం పారేది. అలాంటిది ఎన్నడు లేని విధంగా నా బోరు ఎండిపోయింది. పంట ఎండుతున్నదని మళ్లీ బోరు ఏసిన. ఏం లాభం లేదు. చేతికొచ్చిన పంట మొత్తం పోయింది. చేసేదేమీ లేక ఇడిసిపెట్టిన. గొర్లు మేపుకుంటున్రు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లుంటే మాకీ దుస్థితి వచ్చేది కాదు.
– తోట సమ్మయ్య, రైతు (అడవిశ్రీరాంపూర్)