Rasamayi Balakishan | తిమ్మాపూర్, జనవరి 31: కమిషన్లు, కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్టు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యవహరిస్తున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు కాంట్రాక్టులు, ఇసుక వరకే పరిమితమైన వారి అరాచకాలు నేడు గ్రానైట్ బండపై పడ్డాయని, అది కూడా ఎంతో పవిత్రంగా కొలిచే మైలారం మల్లికార్జున స్వామి గుట్టపై షాడో కన్ను పడిందని, వారంలోగా వారిని వదిలిపెట్టకపోతే తీవ్రస్థాయిలో స్పందిస్తామని హెచ్చరించారు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలో నియోజకవర్గం, మండల నాయకులతో కలిసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గత కొంతకాలంగా ఏ నియోజకవర్గంలో లేని విధంగా నిత్యం వార్తలు వస్తున్నాయన్నారు. షాడో ఎమ్మెల్యే అరాచకాలు, కమీషన్లు, అకృత్యాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నామని, షాడో ఎమ్మెల్యేపై ఎన్నో కథనాలు వస్తుంటే స్పందించని ఎమ్మెల్యే కవ్వంపల్లికి చివరకు షాడో ఎమ్మెల్యే వల్లనే మంత్రి పదవి పోయిందని ఆరోపించారు.
తాను అభివృద్ధి చేసిన.. వాళ్లు చేసేది అరాచకాలు ..
తాను నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే అరాచకాలు చేస్తూ నియోజకవర్గ పేరును ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని దుయ్యబెట్టారు. మిడ్ మానేరు నుంచి కాలువల ద్వారా నీటిని తీసుకొచ్చి గన్నేరువరం మండలాన్ని అభివృద్ధి చేసినమని, ప్రస్తుతం మీరు విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. గన్నేరువరం మండలంలో ఉన్నవే చిన్న గుట్టలు వాటిపై ఎమ్మెల్యే, అతని షాడో ఎమ్మెల్యే కన్నుపడి కబ్జా చేసే దాకా ఊకోలేదన్నారు. అగర్వాల్ కార్వాకు చెందిన గ్రానైట్ క్వారీని సుడా చైర్మన్, షాడో ఎమ్మెల్యే బెదిరించి పైసలు తీసుకున్నది నిజం కాదా.. అని ప్రశ్నించారు.
దళిత మంత్రి సంతకాని ఫోర్జరీ చేస్తావా..?
సాక్షాత్తు గనులశాఖా దళిత మంత్రి వివేక్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ లెటర్ తయారుచేసి రూ.200కోట్ల కుంభకోణానికి తెర లేపారన్నారని విమర్శించారు. ఒక దళిత మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటే, సామాన్యుల పరిస్థితి ఏంటో తెలిసిపోతోందని వ్యాఖ్యానించారు. మానకొండూరు నియోజకవర్గంలో ఇసుక క్వారీలతో పాటు గనులను కబ్జా చేశారన్నారని మండిపడ్డారు. అంతేకాక ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి సైతం రూ.30లక్షలు వసూలు చేశారనీ విమర్శించారు.
రూ.200కోట్లు సంపాదించడమే లక్ష్యం
అర్జంటుగా రూ.200కోట్లు సంపాదించడమే ఆయన లక్ష్యమని, జోలె పట్టి అడుక్కొని నీకు పైసలు వసూలు చేసి తీసుకొస్తామని, వసూళ్లకు పాల్పడి నియోజకవర్గ ప్రతిష్టను దెబ్బతీయొద్దని రసమయి విజ్ఞప్తి చేశారు. షాడో మురళీధర్ రెడ్డి అక్రమాలకు అంతం లేదా..? అని, మైలారం మల్లిఖార్జున స్వామి ఆలయాల గుట్టలను సైతం గ్రానైట్ క్వారీలుగా మార్చి డబ్బులు దండుకోవడమే ఎంఎల్ఏ లక్ష్యమా..? అని ప్రశ్నించారు. వెంటనే అక్కడి గుట్ట వద్ద ఉన్న మిషన్లు తీయకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. అలుగునూర్ చౌరస్తాలో దుకాణం పెట్టి ఇందిరమ్మ ఇండ్లకు సిమెంట్, సలాక అక్కడి నుంచి కొనేలా చేస్తూ డబ్బులు దండుకొంటున్నారన్నారని మండిపడ్డారు. అంతేకాక ఇందులో తనవంతు వాటా కోసం ముందుకొస్తున్న సుడా చైర్మన్ ను కూడా హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. మానకొండూర్ నియోజకవర్గాన్ని నాశనం చేస్తా అంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే నువ్వా, షాడోనా..?
ఫోర్జరీ చేసిన సంతకం మంత్రి వివేక్ గారిదేనా..? దమ్ముంటే నువ్వు రుజువు చేయాలని రసమయి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే అరాచకాలు, అక్రమాలు నియోజకవర్గంలో పెరిగిపోయాయని, వీటిపై సీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మండల నాయకులు పాల్గొన్నారు.