జగిత్యాల కలెక్టరేట్, జూన్ 25 : మూకుమ్మడిగా దాడి చేసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి బుధవారం తీర్పునిచ్చారు. సీఎంఎస్ ఎస్ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన పడాల రాజిరెడ్డి, పడాల చిన్నరాజిరెడ్డి అన్నదమ్ములు. వీరు 2021 జూన్ 15న అదే గ్రామంలో మున్నూరుకాపు సంఘ భవనంలో జరుగుతున్న వివాహానికి వెళ్లారు.
అదే గ్రామానికి చెందిన సుంకె రమేశ్ సైతం వివాహానికి వచ్చాడు. పెండ్లి జరుగుతుండగా రమేశ్ తదేకంగా చూస్తుండడంతో ఎందుకు చూస్తున్నావు? మంత్రాలు చేసి చంపేస్తావా..? అంటూ చిన్నరాజిరెడ్డి అడుగగా, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పెండ్లికి వచ్చిన వారు గొడవను ఆపి ఇద్దరిని శాంతింపజేశారు. ఈ ఘటనను రమేశ్ తీవ్ర అవమానంగా భావించాడు. చిన్నరాజిరెడ్డిని చంపితేనే అవమానభారం తొలగిపోతుందని భావించి, సంఘ భవనం నుంచి వెళ్లిపోయి అతడి బంధువులైన సుంకె రాజు, సుంకె రంజిత్, సుంకె సురేశ్, సుంకె లక్ష్మి, సుంకె రాజేశ్వరి, సుంకె దశరథ్ను తీసుకుని సంఘ భవనం వద్దకు చేరుకున్నాడు.
అక్కడే బయట నిల్చున్న చిన్నరాజిరెడ్డిపై సుంకె రమేశ్‌తో పాటు మిగతావారు సైతం మూకుమ్మడిగా దాడికి దిగారు. చిన్నరాజిరెడ్డిపై దాడి చేస్తున్న విషయాన్ని గమనించిన అతడి అన్న రాజిరెడ్డి వచ్చి దాడిని ఆపే ప్రయత్నం చేశాడు. ‘చిన్నరాజిరెడ్డిని కాదు, అసలు నిన్నే చంపాలి. నీ బలం చూసుకునే చిన్నరాజిరెడ్డి రెచ్చిపోతుండు. నిన్ను చంపితేనే చిన్నరాజిరెడ్డి దారికి వస్తడు’ అని అరుస్తూ రమేశ్, రాజు, రంజిత్, సురేశ్, లక్ష్మి, రాజేశ్వరి, దశరథ్ కట్టెలు, ఇనుప రాడ్లతో రాజిరెడ్డిపై విచక్షణారహితంగా దాడిచేశారు.
గాయపడ్డ అన్నదమ్ములు రాజిరెడ్డి, చిన్నరాజిరెడ్డిని స్థానికులు హుటాహుటిన మెట్పల్లి ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అదే రోజు రాత్రి నిజామాబాద్‌కు తరలిస్తుండగా, మార్గం మధ్యలో రాజిరెడ్డి మృతిచెందాడు. రాజిరెడ్డి భార్య పడాల మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం అప్పటి ఎస్ఐ కే వెంకట్రావు కేసు నమోదు చేయగా, మెట్పల్లి అప్పటి సీఐ ఎల్ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు.
అడిషనల్ పబ్లిస్ ప్రాసిక్యూటర్ మల్లికార్జున్ కేసు వాదించి చిన్నరాజిరెడ్డిపై దాడి, రాజిరెడ్డిని హత్య చేసినట్టు రుజువు చేయడంతో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా న్యాయమూర్తి బుధవారం తీర్పునిచ్చారు. హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు పడేలా కృషి చేసిన విధులు నిర్వర్తించిన సీఐ ఎల్ శ్రీను, ఎస్ఐ వెంకట్రావు, సీఎంఎస్ ఎస్ఐ శ్రీకాంత్, సీఎంఎస్ కానిస్టేబుల్ కిరణ్‌కుమార్, కోర్టు కానిస్టేబుల్ టీ రంజిత్‌ను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.