Server down | కోల్ సిటీ, జూన్ 6: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని రేషన్ దుకాణాలు శుక్రవారం సర్వర్ డౌన్ పేరుతో అర్ధంతరంగా మూసివేశారు. ఉదయం ఎప్పటిలాగే దుకాణాలు తెరిచిన డీలర్లు కొద్ది సేపటికే సర్వర్ డౌన్ అంటూ లబ్ధిదారులను మరుసటి రోజు రమ్మని పంపించి పలాయనం చిత్తగించారు. అయితే శుక్రవారం విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ , పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీల కోసం వస్తున్నారన్న సమాచారం ముందే లీక్ కావడంతోనే డీలర్లు ఒక్కసారిగా బంద్ పెట్టి ఉడాయించినట్లు తెలుస్తోంది.
పారిశ్రామిక ప్రాంతంలోని రేషన్ దుకాణాలలో తూకంలో మోసం జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో రామగుండం తహసీల్దార్ ప్రసాద్ ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గోదావరిఖనిలోని రేషన్ దుకాణాలను తనిఖీ చేయడానికి వస్తుండటంతో సమాచారం తెలుసుకున్న డీలర్లు సర్వర్ డౌన్ సాకుతో బంద్ పెట్టి జారుకున్నట్లు తెలిసింది.
కాగా, సన్నబియ్యం దేవుడెరుగు.. మూడు నెలల బియ్యం కోసం లబ్ధిదారులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇందుకు ఆరుసార్లు వేలుమద్రలు వేయాల్సి వస్తుంది. ఒక్కో లబ్ధిదారుడికి సుమారు అరగంట సమయం తీసుకుంటుంది. దీనితో మిగతా లబ్దిదారులు దుకాణం బయటే నిలబడి అలసి సొలసిపోతున్నారు. కాగా, రామగుండం కార్పొరేషన్ పరిధిలో 74 రేషన్ దుకాణాలు ఉండగా దాదాపు అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 59 వేల పాత రేషన్ కార్డులు ఉన్నాయి. ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. మొదటి మూడు రోజులు సక్రమంగానే బియ్యం పంపిణీ చేసిన డీలర్లు ఇక నాలుగో రోజు నుంచి ఒక్కొక్కరుగా నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. కొన్ని దుకాణాల్లో డీలర్లు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు.
గురువారం ఒక డివిజన్లో డీలర్ మోసం చేస్తున్నాడని లబ్దిదారులు గొడవకు దిగారు. ఐతే ఒక కార్డు దారునికి 18 కిలోల బియ్యం పోయాల్సి ఉంటే మొదట 15 కిలోలు కాంటా వేసి, మరోసారి 3 కిలోల చొప్పున కాంటా వేస్తున్నారు. ఇదేమిటని లబ్దిదారులు అడిగితే ఆన్లైన్లో అలాగే తీసుకుంటుందని బుకాయిస్తున్నారు. ఇలా ఒక్కో లబ్ధిదారుడికి ఆరుసార్లు పోయాల్సి వస్తుంది. ఈ సాకుతో తూకంలో మోసం జరుగుతుందని పలువురు లబ్ధిదారులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడు నెలల బియ్యం అనేసరికి లబ్ధిదారులకు ప్రహసనంగా మారింది.
రేషన్ దుకాణాలకు వచ్చే మహిళలు, వృద్ధులు ఒకేసారి 50 నుంచి 70 కిలోల బియ్యం తీసుకవెళ్లే పరిస్థితి లేక దుకాణాల వద్దనే గంటల పాటు. అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. గంటల పాటు లైనులో నిలబడాల్సి వస్తుండటంతో కొందరు అలసి సొలసి ఇంటికి ఖాళీ సంచులతోనే వెనుదిరిగి వెళ్తున్నారు. ఇక శుక్రవారం నుంచి డీలర్లు తమ చేతివాటంను ప్రదర్శించడం మొదలుపెట్టారు. సర్వర్ డౌన్ సాకుతో దుకాణాలు మూసివేసి జారుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.