Theft | రామగిరి, అక్టోబర్ 12: రామగిరి మండలంలో చోరీలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాయి. గత మూడు నెలలుగా దొంగలు ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. గతంలో కల్వచర్ల గ్రామానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఏఈ ఇంట్లో పెద్ద ఎత్తున చోరీ జరిగింది. కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి వెళ్ళిన సమయంలో దొంగలు ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బీరువాను పగలగొట్టి దాదాపు 15 తులాల బంగారు నగలు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటివరకు నిందితుల జాడ తెలియలేదు. తాజా గా జరిగిన ఘటనలో శనివారం ముల్కలపల్లి గ్రామానికి చెందిన దశరథం గౌడ్ తన భార్యతో కలిసి సెంటినరీ కాలనీ దవాఖానకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో నిత్యం రద్దీగా ఉండే కోల్ కారిడార్ రోడ్డులో దొంగలు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. అతని భార్య మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి లాగేసి పరారయ్యారు. ఇక ఈ సంఘటన షాక్ నుంచి బయటపడక ముందే, ఆదివారం కల్వచర్లలోనే మరో ఇంట్లో దొంగతనం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన బీ రాజయ్య దసరా పండుగకు పెద్దపల్లి లో ఉంటున్న కొడుకు వద్ద కు వెళ్ళిన సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంటికి వేసిన తాళం పగల గొట్టి లోపలికి ప్రవేశించి, విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట గస్తీ పెంచాలని, దొంగలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసు అధికారులను కోరుతున్నారు.