Peddapally | ఓదెల, డిసెంబర్ 20 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో ఎమ్మెల్యే విజయ రమణారావు తీరును నిరసిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోశిక రాజేశం శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయిన తనకు మద్దతు ఇవ్వకుండా ఫీల్డ్ అసిస్టెంట్ కు మద్దతు ఇచ్చారని నిరసన వెలిబుచ్చారు. కాంగ్రెస్ అధిష్టాన నాయకుల ఫ్లెక్సీ కి తన రక్తంతో కాళ్ళను కడిగారు. ఈ సందర్భంగా రాజేశం దంపతులు మాట్లాడుతూ తనపై కక్షతో ఎమ్మెల్యే తాను సర్పంచ్ గా గెలవకుండా ఫీల్డ్ అసిస్టెంట్ కు ప్రచారం నిర్వహించారని అన్నారు.
మాదిగ కులస్తులైన తమను కాకుండా మిత్తిలి కులానికి చెందిన వ్యక్తికి కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా అనేక కార్యక్రమాలు పార్టీ ఆదేశాలతో నిర్వహించినట్టు తెలిపారు. గ్రామంలో భూస్వాముల ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిపై పోరాటం చేసినందుకు తనపై కక్ష కట్టారని తెలిపారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లాలని ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే తీరును రాజేశం దంపతులు తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో అధిష్టానం దృష్టి సారించాలని కోరారు.