మెట్పల్లి రూరల్, డిసెంబర్ 21 : పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలని మెట్పల్లి మండల లీగల్ సెల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, మెట్పల్లి సబ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు సూచించారు. శనివారం ఆయన పాఠశాలను పరిశీలించారు. ఐదు నెలల క్రితం ఇద్దరు విద్యార్థుల మృతి, నలుగురు విద్యార్థుల అస్వస్థత, తాజాగా మరో ఇద్దరు విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీశారు. విద్యార్థులు నిద్రించిన బెడ్లను పరిశీలించి ఇన్చార్జి ప్రిన్సిపాల్, సిబ్బంది నుంచి పలు వివరాలను సేకరించారు.
కిచెన్ షెడ్‌కు వెళ్లి నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లను పరిశీలించారు. నాణ్యత లేని సరుకులను తిప్పి పంపుతున్నారా.. లేదా? అని ఆరా తీశారు. అలాగే, గురుకుల ఆవరణను పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, తమ పరిశీలన నివేదికను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా జడ్జితోపాటు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి అందిస్తామని తెలిపారు.
విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు తెలిపి, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఆయన వెంట మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి వేణు, ఏజీపీ అబ్దుల్ హఫీజ్, న్యాయవాదులు పాల్గొన్నారు.