Selfie Video Viral | చిగురుమామిడి, జనవరి 27 : తన చావుకు కుటుంబ సభ్యులే కారణమంటూ ఓ యువకుడు సెల్ఫీ దిగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోషల్మీడియాలో వైరల్ గా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. చిగురు మామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన నాగేల్లి రాజిరెడ్డి- అనసూయ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు నాగేల్లి వెంకటేష్ రెడ్డి (29) కి రెండు నెలల క్రితం వివాహం జరిగింది.
వీరు మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో రూ.12 లక్షలతో సూపర్ మార్కెట్ ను వెంకటేష్ రెడ్డి తో పాటు చిన్న కుమారుడిని ఇద్దరిని నడిపించాలని సూచించారు. సూపర్ మార్కెట్ బాగా నడుస్తున్నప్పటికీ, కొంతకాలంగా తల్లిదండ్రులతో వెంకటేష్ రెడ్డికి గొడవలు రావడంతో పాటు సూపర్ మార్కెట్ కు రూ.17 లక్షల పెట్టుబడి పెట్టినామని డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులు వేధింపులు గురి చేస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు. రూ.12 లక్షలు మాత్రమే సూపర్ మార్కెట్ కు పెట్టుబడి పెట్టారని, ఇందుకు గాను రూ.మూడు లక్షలు ఇచ్చామని, మిగతా డబ్బులు సంవత్సరంలోగా ఇస్తానని తల్లిదండ్రులను ప్రాధేయపడినప్పటికీ ఒత్తిడికి గురి చేయడంతో విధులేని పరిస్థితిలోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తనను నమ్ముకుని వచ్చిన భార్య మనీషా కు రూ.10 లక్షలు ఇప్పించి వారి తల్లిదండ్రులకు అప్పగించాలని స్థానిక ఎస్సైని కోరారు. తన ధన సంస్కారాలకు హంగు ఆర్భాటాలు లేకుండా వైకుంఠధామంలోనే నిర్వహించాలన్నారు. తన మిత్రుడైన అజయ్ రెడ్డి దాన సంస్కారాలు నిర్వహించాలని, అనంతరం ఉజ్జయినిలోని శుక్ర నదుల అస్తికలు కలపాలని అజయ్ రెడ్డిని కోరారు. తన కుటుంబానికి ఎస్సై పూర్తిగా సహకారం అందించి తన భార్యకు న్యాయం చేయాలని కృషి చేయాలని కోరారు. తన మృతికి ఎవరూ కారకులు కారని, తల్లిదండ్రులే కారకులని వీడియోలో పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.