కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 2: కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న తమకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు డిమాండ్ చేశారు. మూడు నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని ప్రభుత్వ హాస్పిటల్స్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారి శేఖర్ ఆధ్వర్యంలో గత నెలలో సమ్మె నోటీసు ఇచ్చినా ఫలితం లేదని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం జీజీహెచ్ ఎదుట ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి శేఖర్ మాట్లాడుతూ, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు నెలల పెండింగ్ వేతనాలతోపాటు పీఎఫ్, ఈపీఎఫ్ కార్మికుల ఖాతాలో జమ చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికులందరికి ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్ ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్, కళావతి, ఉపాధ్యక్షురాలు శారద, నాయకులు సరళ, రేఖ, సతీష్, సాయి, అరుణ్, దివ్య, జ్యోతి, అంజలి పాల్గొన్నారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ, కార్మికులకు మూడు నెలల వేతనాలను అధికారులతో మాట్లాడి బడ్జెట్ రిలీజ్ చేయించామని, నేరుగా కార్మికుల ఖాతాల్లోనే జమ అవుతాయని చెప్పారు. సీజనల్ వ్యాధులు సమీపిస్తున్న సమయంలో కార్మికులందరూ విధిగా డ్యూటీలకు హాజరుకావాలని సూచించారు. కాగా, దాదాపు 200 మంది కార్మికులు ధర్నాకు దిగడంతో ఒక్క రోజులోనే దవాఖానలో అపరిశుభ్రత ఏర్పడింది. రోగులను వారి బంధువులే వీల్ చైర్లు, స్ట్రెచర్లపై తీసుకెళ్లి వైద్యం చేయించుకున్నారు.