శంకరపట్నం, జనవరి 10 : మండలంలోని ఎరడపల్లి శివారులోని ఓ రైతు పొలంలో శేష శయనుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి శిల్పం బయటపడింది. చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి శుక్రవారం ఈ శిల్పాన్ని గుర్తించి, వివరాలు వెల్లడించారు. ఎరడపల్లి నుంచి వన్నారం వెళ్లే దారిలో అంజయ్య అనే రైతు పొలంలో పాము గుండు ఉంది. అయితే, ఈ గుండుపై పాము ఆకారంలో ఉన్న చిత్రం ఉందని స్థానికులకు ఇది వరకే తెలిసినా, దానిని నిశితంగా పరిశీలిస్తే శేష సర్పం ఐదు చుట్లు చుట్టుకొని పడగెత్తి ఉండగా, మధ్యలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన విష్ణుమూర్తి శయనిస్తున్నట్లు ఉందని రత్నాకర్‌రెడ్డి వివరించారు.
ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిని మడచి తలకింద పెట్టుకొని చిద్విలాసం.గా కనిపిస్తున్నట్లు ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా ఎరడపల్లిలో గల 11వ శతాబ్దం నాటి శివాలయంలో సూర్యుడి విగ్రహం, హనుమాన్ ఆలయంలో పిలక జుట్టుతో కోతిలా కనిపించే భక్తాంజనేయ శిల్పం, అలాగే గుడి ముందు నాటిన ఓ శిల పైభాగాన రెండు వైపులా నోరు తెరిచిన పులి చిత్రం ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి శిల్పం వివరాలు వెలుగులోకి రావడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.