రుద్రంగి/ కోరుట్లరూరల్/ ముస్తాబాద్, ఆగస్టు 4 : ఒకవైపు ఆలస్యమైన వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులు.. మరోవైపు యూరియా బస్తాలు అందక నానా తంటాలు పడుతున్నారు. సహకార సంఘాల్లో రైతులకు సరిపోయేన్ని బస్తాలు ఇవ్వకపోవడంతో సాగు పనులను వదులుకొని సొసైటీ గోదాంల ఎదుట ఉదయం నుంచి పడిగాపులు గాస్తున్నారు. ఒకరికి ఒకటే బస్తా ఇవ్వడం.. కొన్నిచోట్ల ఎకరాకు ఒక్క బస్తా చొప్పున అందించడం..
మరికొన్ని చోట్ల పోలీసుల పహారా మధ్య పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రుద్రంగి సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా బస్తాలు ఇవ్వడంతో రైతులు వ్యవసాయ పనులను వదులుకొని సొసైటీ గోదాం ఎదుట బారులు తీరారు. తమ ఆధార్ కార్డులు వరుసలో పెట్టి యూరియా బస్తాల కోసం పడిగాపులు కాశారు. తీరా ఒక్కరికి ఒక ఆధార్ కార్డుపై ఒకటే ఇవ్వడంతో ఆగ్రహించారు. ఆ ఒక్కటి కూడా దొరుకుతుందో లేదో అని ఎగబడ్డారు.
చాలా మంది గంటల తరబడి నిరీక్షించి యూరియా అందక నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో సరిపడా యూరియా అందడం లేదని మండిపడ్డారు. కోరుట్ల మండలంలోని ఐలాపూర్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియాను పోలీసు పహారా మధ్య పంపిణీ చేశారు. సహకార సంఘానికి 450 బస్తాలు రాగా ఎలాంటి గొడవలు జరుగకుండా ముందస్తుగా పోలీసు పహారా ఏర్పాటు చేశారు. రైతులు ఆధార్‌కార్డు, పట్టాపాస్ బుక్ జిరాక్సుతో వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందించగా, ఆన్లైన్లో నమోదు చేసుకొని ఎకరానికి ఒక బస్తా చొప్పున సుమారు 80 మంది రైతులకు అందజేశారు.
కాగా, బీఆర్ఎస్ పాలనలో పంటల అవసరం మేరకు గోదాముల్లో ముందస్తుగా ఎరువులు నిల్వలు చేసి పంపిణీ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ పహారా మధ్య తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని రైతులు వాపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే గానీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం గోదాముల వద్ద నిరీక్షించారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం వద్ద రైతులు ఉదయం నుంచే నిరీక్షించారు. పరిమితితో ఇవ్వడంతో తమ వరకు వచ్చే వరకు ఉంటాయో లేదోనని కొందరు గుంపులుగా ఎగబడ్డారు.