Science exhibition | వీణవంక, సెప్టెంబర్ 15 : వీణవంక మండల కేంద్రంలో సోమవారం మల్లారెడ్డి విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల జీవనవిధానం, సమస్యలు, అవకాశాల గురించి స్వయంగా విశ్లేషణ చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతులు, బయటి నుండి వచ్చే నిపుణులు, అధికారులు ప్రజలకు పరిష్కారాలు చెప్పడం కాకుండా ప్రజలే వారి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాలు కనుగొనడంలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించే పద్ధతులను విద్యార్థులు వివరించారు.
గ్రామంలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, నీటి వసతులు, దేవాలయాలు, రోడ్లు, తదితర అంశాలను చిత్రాల రూపంలో వేసి ప్రజలకు, రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థులు ప్రతి, శోభా, ప్రసీద, ప్రియాంక, నందిత, ప్రణతి, లావణ్య, మనీషా, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.