వీర్నపల్లి, ఆగస్టు 5: ప్రభుత్వ పాఠశాలల గోడలపై జీవ, సాంఘిక శాస్త్రం ఉట్టిపడేలా కళాత్మక చిత్రాలను రూపొందిస్తూ స్కూళ్ల రూపురేఖలనే మారుస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. వివిధ రంగులతో విద్యార్థులను కట్టిపడేసేలా అద్భుత కళాఖండాలు వేస్తూ అబ్బురపరచడమే కాకుండా విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నాడు సందవేణి రమాకాంత్. వీర్నపల్లి మండలంలోని బావుసింగ్‌నాయక్ తండా ఎంపీపీఎస్ పాఠశాలలో సందవేణి రమాకాంత్ ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
సర్కారు బడిపై ఉన్న మమకారంతో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూన్తే, తన సృజనాత్మకతతో సర్కారు పాఠశాల రూపురేఖలు మారుస్తున్నాడు. అతను కంచర్ల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు అక్కడి పాఠశాల గోడలపై వివిధ రకాల చిత్రాలను వేశాడు. ఆ పాఠశాల సందర్శనకు వెళ్లిన వీర్నపల్లి జీడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ చిత్రాలను చూసి ఉపాధ్యాయుడిని అభినందించడంతో పాటు తమ పాఠశాలకు వేయాలని కోరాడు. తన మిత్రుడు ఎన్ఆర్ఐ దిలీప్ రంగులకు అయ్యే ఖర్చు రూ. 10 వేలు అందించగా రంగులు కొనుగోలు చేసి పాఠశాల గోడలపై చిత్రాలు వేశాడు. వారాంతపు సెలవుల్లో సమయం కేటాయించి ఉమ్మెత్త పువ్వు, నాడీ కణం, నీటి చక్రం, భారతదేశం, తెలంగాణ రాష్ట్ర చిత్ర పటంతో పాటు పలు రకాల చిత్రాలను వేశాడు. దీంతో రమాకాంత్‌ను తోటి ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నా రు. కాగా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో తన మిత్రుల ప్రోత్సాహంతో చిత్రాలు వేస్తున్నానని, సెలవు రోజు ల్లో మాత్రమే వీటిని వేస్తున్నట్లు రమాకాంత్ చెబుతున్నారు.