Schools | పెద్దపల్లి, మే7: ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో టీజీఈడబ్ల్యూఐడీసీ ద్వారా పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులు, యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనుల పురోగతి వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు బుధవారం వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మోడల్ స్కూల్స్, గురుకులాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో టీజీఈడబ్ల్యూఐడీసీ ద్వారా చేపట్టిన అదనపు తరగతులు, సైన్స్ ల్యాబ్ నిర్మాణం, కాంపౌండ్ వాల్ వివిధ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనులు ప్రారంభించాలని, నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.
రామగుండం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రినోవేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం కింద గోదావరిఖని పీజీ కళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు టెండర్ ఒప్పందం పూర్తి చేసి, ఈనెల 20 వరకు పనులు ప్రారంభించాలన్నారు. చిల్డ్రన్ హోమ్ నిర్మాణంలో పురోగతి సరిగ్గా లేకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేలా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
రూ. 1.10 కోట్లతో చేపట్టే ఐటీఐ ఇన్నోవేషన్ పనుల టెండర్లు పూర్తి చేసి 5 నెలల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలోటీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అనితా శింగనాథ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.