Collector Koya Sri Harsha | కాల్వ శ్రీరాంపూర్ , జూలై 18: నిర్మాణంలో ఉన్న పాఠశాలలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. అంకంపల్లి గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మడిపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్, నిర్మాణంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల, ఉషన్నపల్లి గ్రామంలోని నిర్మాణంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మెట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కిష్టంపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంకంపల్లి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారం అధికారులు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. మడిపల్లి, ఉషన్నపల్లి గ్రామాలలో నిర్మాణంలో ఉన్న పాఠశాలల పనులు త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
మడిపల్లి పాఠశాలలో ప్రహరీ, గ్రౌండ్ లెవెలింగ్ పనులు కూడా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మొట్లపల్లిలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణలో కలెక్టర్ మొక్క నాటారు. కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేయాలని, ముఖ్యంగా పాఠశాల ప్రాంగణం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ మండల పంచాయతీ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎంపీడీవో పూర్ణ చందర్ రావు, మండల పంచాయతీ అధికారి ఆరిఫ్, పంచాయతీరాజ్ ఏఈ శ్రవణ్, మండల విద్యాశాఖ అధికారి మహేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.