కరీంనగర్ జిల్లాలోని ఓ సర్కారు బడి అటెండర్ ఏడాది కాలంగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. బాలికలతో దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేసి.. బెదిరిస్తూ వేధింపులకు దిగినట్టు బహిర్గతమైంది. ఈ కీచక అటెండర్‌ను మంగళవారం అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం ఏడాది కిందనే తెలిసినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లని కారణంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ మూకుమ్మడి బదిలీ చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించగా, మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు.
కరీంనగర్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)/ గంగాధర : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటకు చెందిన ఎండీ యాకూబ్ పాషా (30) కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మూడేళ్లుగా అటెండర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఏడాది కాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. గత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు విద్యార్థినులతో ఫొటోలు దిగాడు. వాటిని మార్ఫింగ్ చేసి ఆ విద్యార్థులకు చూపిస్తూ బెదిరించడమే కాకుండా, వేధింపులకు దిగాడు. కొందరు విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. దాంతో బాధిత విద్యార్థినులు ఆ అటెండర్‌పై గతంలోనే ఫిర్యాదు చేసినా.. ప్రధానోపాధ్యాయురాలు పట్టించుకోకపోవడంతోపాటు విద్యార్థినులనే బెదిరించి విషయాన్ని దాచిపెట్టారు. అయితే శుక్రవారం సభలో భాగంగా ఈ నెల 24న పలు శాఖల అధికారులు ఆ పాఠశాలకు వెళ్లారు.
లైంగిక విషయాలపై అవగాహన కల్పిస్తున్న సమయంలో విద్యార్థినులు తమపై అటెండర్ చేస్తున్న అకృత్యాలను చెప్పుకున్నారు. అటెండర్ యాకూబ్ ఏడాది కాలంగా తమను లైంగికంగా వేధిస్తున్నాడని, హెచ్ఎంకు చెప్పుకొన్నా పట్టించుకోవడం లేదని మొరపెట్టుకున్నారు. అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్, విద్యా, పోలీస్ శాఖ అధికారులు మూడు రోజులపాటు పాఠశాలలో విచారణ చేపట్టి, విద్యార్థుల నుంచి మరిన్ని విషయాలను తెలుసుకున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయురాలు టీ కమల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ ప్రత్యేక చొరవతో దర్యాప్తు జరిపారు. పలువురు విద్యార్థినులపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారించుకున్న ఏసీపీ.. అటెండర్ యాకూబ్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశించడంతో మంగళవారం ఉదయం రేకుర్తి చౌరస్తాలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యాకూబ్ పాషాపై బీఎన్ఎస్, పోక్సో, ఐటీ చట్టాల్లోని కఠినమైన సెక్షన్లలో కేసు నమోదు చేశారు. విద్యార్థినులు విషయం చెప్పినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లక పోవడంతో పాఠశాల హెచ్ఎం కమలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్ దాటి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న మరో పది మంది ఉపాధ్యాయులకు విషయం తెలిసినా అధికారుల దృష్టికి తీసుకెళ్లని కారణంగా.. వారికి సైతం షోకాజ్‌లు జారీ చేస్తూ మూకుమ్మడి బదిలీ చేశారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వేధించిన సంఘటన రాష్ట్రం మొత్తం తెలిసినా.. రెండు రోజులుగా సంచలనం సృష్టిస్తున్నా.. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు తెలియకుండా ఉంటుందా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ విద్యాసంస్థలకు వెళ్లి తనిఖీలు చేస్తున్న ఆమెకు, తన సొంత జిల్లాలో జరిగిన సంఘటన కనిపించలేదా..? అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ సభ్యులు విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల తీరుపై విచారణ జరిపించి వారిని కూడా బాధ్యులను చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం మరో బీహార్‌లా మారిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులను కంటికిరెప్పలా కాపాడుకున్నామని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాలయాలను గాలికొదిలేశారని విమర్శించారు. విద్యాశాఖను తనవద్దే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలపై కనీసం సమీక్షించడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 60 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన చేతగాని రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులపై వేధింపుల ఘటనలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. మంగళవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్‌తో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. అటెండర్ యాకూబ్ పాషాను విధుల నుంచి పూర్తిగా తొలగించాలని, బాధ్యులైన ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అటెండర్ అసభ్యప్రవర్తనకు గురైన విద్యార్థినులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సహా పోలీస్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసు పురోగతిని మహిళా కమిషన్ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
లైంగిక వేధింపుల విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు భగ్గుమన్నారు. మంగళవారం పెద్ద సంఖ్యలో పాఠశాలకు వచ్చి, ఆందోళనకు దిగారు. తమ పిల్లలను కలిసి మాట్లాడతామని కోరినా అనుమతించక పోవడంతో ఆగ్రహించారు. అక్కడి నుంచి కరీంనగర్, జగిత్యాల రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేశారు. అంబేద్కర్ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ సహా పలు పార్టీల ఆధ్వర్యంలో గంగాధర ఎక్స్ రోడ్లో కూడా ఆందోళన చేశారు. కీచక అటెండర్ దారుణాల గురించి హెచ్‌ఎంతోపాటు ఉపాధ్యాయులకు తెలిసినా పట్టించుకోలేదని, మూడు నెలలకోసారి జరిగే పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లోనూ ఈ విషయాన్ని చర్చించలేదని తల్లిదండ్రులతోపాటు ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. నిందితుడితోపాటు దారుణమైన ఈ విషయాన్ని దాచిపెట్టిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.