జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కొప్పుల చొరవతో ఈ ఏడాది ఏర్పాటు చేసిన ఎస్సీ స్టడీ సర్కిల్ తొలి ప్రయత్నంలోనే అద్భుత ఫలితాలు సాధించింది. సకల సౌకర్యాల కల్పన, రుచికరమైన భోజనం, సబ్జెక్ట్ నిపుణుల బోధన, నాణ్యమైన మెటీరియల్ అందించడంతో ఫస్ట్ బ్యాచ్ లోనే మంచి రిజల్ట్ వచ్చింది. సుమారు 90 మంది శిక్షణ తీసుకోగా 10 మంది గ్రూప్-1, 32 మంది ఎస్.ఐ మెయిన్స్‌కు అర్హత సాధించడం శిక్షణ తీరుకు అద్దంపట్టింది. ఎంపికైన అభ్యర్థులు రాత్రింబవళ్లు శ్రమించి ఉద్యోగాలు సాధించాలని అమాత్యుడు ఆకాంక్షించారు.
జగిత్యాల, జనవరి 23, (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పెద్దసంఖ్యలో సర్కారు కొలువుల భర్తీ చేపట్టింది. ఈ దిశగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నింపేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా గ్రూప్-1, గ్రూప్-2, 3, 4 ఉద్యోగాలు, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఆదర్శ పాఠశాలల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసింది. అయితే ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో ఆర్థికంగా ఉన్నవారు హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలకు వెళ్లి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు. స్థోమతలేనివారు ఇంటివద్దే అందుబాటులోఉన్న మెటీరియల్‌తోనే చదువుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పేద, మధ్య తరగతి అభ్యర్థుల కోసం మెరుగైన శిక్షణ ఇవ్వాలని సంకల్పించింది.
ఇందులోభాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో జగిత్యాల జిల్లాకేంద్రంలో రూ. 1.20 కోట్లతో ఎస్సీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. దీంతో గతేడాది జనవరిలో 100 మంది ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సమాయత్తమైంది. దరఖాస్తులను ఆహ్వానించి మొదటి బ్యాచ్‌లో 45 మంది మహిళలకు, 45 మంది పురుషులు మొత్తం 90 మందికి స్టడీ సర్కిల్లో కోచింగ్ అవకాశం కల్పించింది. భోజనం, వసతి కల్పిస్తూ, ఐదు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. కోచింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే తెలంగాణ పోలీస్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్లు ఇచ్చింది దీంతో ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్దం కావడంలో నిమగ్నమైంది.
50 శాతం మెయిన్స్‌కు..
జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో 90 మంది అభ్యర్థులు ఐదు నెలలపాటు శిక్షణ తీసుకున్నారు. ఇందులో 42 మంది తొలిప్రయత్నంలోనే మెరుగైన ఫలితాలు సాధించారు. 10 మంది గ్రూప్ 1 మెయిన్స్‌కు, ఎస్ఐ మెయిన్స్‌కు 32 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అత్యంత కఠినమైన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో పది మంది ఎంపిక కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ యువత కోసమే..
ప్రభుత్వం పెద్దసంఖ్యలో కొలువులను భర్తీ చేస్తున్నది. అయితే పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే గ్రామీణ ప్రాంత యువత కోచింగ్ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నది. పట్టణాలకు వెళ్లి లక్షలు వెచ్చించి సిద్ధమయ్యే పరిస్థితిలేదు. అందుకే ప్రభుత్వం ద్వారా జగిత్యాలలో ఎస్సీ స్టడీ సర్కిల్ మంజూరు చేయించిన. తక్కువ టైంలో అన్ని సౌకర్యాలు కల్పించినం. మంచి ఫ్యాకల్టీని ఏర్పాటు చేసినం. నిరుద్యోగులు కష్టపడి కొలువులు కొట్టాలి.
సర్కారుకు రుణపడి ఉంట..
జగిత్యాలలో ఎస్సీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసి, పోటీ పరీక్షలకు మంచి శిక్షణ ఇవ్వడం గొప్ప విషయం. ఇక్కడ కోచింగ్ తీసుకున్న నేను కానిస్టేబుల్, ఎస్.ఐ, గ్రూప్ 1 మెయిన్స్‌కు ఎంపికైన. శిక్షణ కాలంలో నాణ్యమైన భోజనం, వసతి కల్పించారు. మంచి గ్రంథాలయం, స్టడీ మెటీరియల్ అందించారు. ఫ్యాకల్టీ అన్ని విషయాలను ఆర్థమయ్యేలా బోధించారు. ముఖ్యంగా రమాదేవి, కృష్ణ బోధన ఎంతో ఉపయోగపడ్డది. స్టడీ సర్కిల్ ఇన్చార్జి నరేశ్ స్టడీ సర్కిల్ నిర్వహణతో పాటు, మంచి ఫ్యాకల్టీ. లక్షల రూపాయలు వెచ్చించినా ఇంత మంచి శిక్షణ లభించదు. ప్రభుత్వానికి ధన్యవాదాలు..
– బాల్క చైతన్య, ఎంసీజే, రేగుంట, గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫయర్
కోచింగ్ బాగున్నది..
నేను రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేసిన. మా నాన్న దుబాయ్‌కి వెళ్లాడు. ఎంతో కష్టపడి చదివించాడు. ఆయన కలను నెరవేర్చాలంటే సర్కారు ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్న. జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో చేరి గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు శిక్షణ తీసుకున్న. ఇక్కడ అన్ని వసతులు కల్పించారు. మంచి ఫ్యాకల్టీతో బోధించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కష్టపడి చదివి మెయిన్స్‌కు ఎంపికైన. రాత్రింబవళ్లు చదివి ఉద్యోగం సాధిస్తా..
– పెంటపర్తి సుచిత్ర, బీటెక్ వేంపేట్, మెట్పల్లి మండలం
జిల్లా యవతకు సువర్ణావకాశం
జగిత్యాల జిల్లా విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం. స్టడీ సర్కిల్లో ఉచిత బోధన, వసతి సౌకర్యాలతో పాటు వంద మందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు స్టడీ సర్కిల్లో బోధించాం. మా ప్రయత్నం ఫలించింది. దాదాపు యాభై శాతం మంది గ్రూప్-1 పోలీస్ ఉద్యోగాలకు మెయిన్స్ పరీక్షలకు ఎంపికయ్యారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.
– జీ నరేశ్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్